‘నిధుల’ కోసం నీళ్ళను నమ్ముకున్న చంద్రబాబు!
‘ఎన్నికలకు ముందు కొత్తగా మరో 17 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు టెండర్లు పిలుద్దాం. ఓకే చేసిన కంపెనీల నుంచి దండుకుందాం. కాంట్రాక్టుల కేటాయింపు అంతా ‘ఫిక్సింగ్’ ప్రకారమే కదా చేసేది’. ఈ ప్లాన్ చూస్తుంటే నిధుల కోసం చంద్రబాబును నీళ్ళను నమ్ముకున్నట్లు ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇలా సాగునీటి శాఖలో కాసుల వేటకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అయితే ఆర్థిక శాఖ మాత్రం ససేమిరా అంటోంది. ఇంకా కొత్త ప్రాజెక్టుల భరించే స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలేదని తేల్చిచెబుతోంది. ఆర్థిక శాఖ హెచ్చరికలను పట్టించుకుంటారా?. లేక అన్నింటిని ఆమోదించినట్లే కేబినెట్ లో ఆమోదించి ఈ ప్రాజెక్టులకు కూడా టెండర్లు పిలుస్తారా.? వేచిచూడాల్సిందే. ఏపీ నీటిపారుదల శాఖ కొత్తగా 15 ప్రాజెక్టులను 17367 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్దకు కూడా చేరింది.
అయితే ఆర్థిక శాఖ అధికారులు ఈ లెక్కలు చూసి షాక్ కు గురయ్యారు. ఇఫ్పటికే చేసిన అప్పుల చెల్లింపులకు వచ్చే ఆరేడు సంవత్సరాల బడ్జెట్ కేటాయింపులు సరిపోతాయని..ఇంకా అప్పులు చేస్తే మాత్రం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని తేల్చిచెప్పారు. అయితే గతంలో ఇలా ఆర్థిక శాఖ చెప్పిన ప్రతిపాదనలను కూడా చంద్రబాబు బేఖాతరు చేసిన సందర్భాలు ఎన్నో. మరో నాలుగు నెలల్లో సాధారణ ఎన్నికలు ఉండగా..ఇప్పుడు ఏకంగా 17వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలవటం వెనక మతలబు ఏమిటి?. టెండర్లు పిలిచేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ల కింద ఇచ్చిన మొత్తాలను తమ వాటాలను తీసుకోవటం కోసమే ఈ ఎత్తు అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మరి ఈ విషయం ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా? లేక ముందుకెళుతుందా వేచిచూడాల్సిందే.
ఏపీ సాగునీటి శాఖ కొత్తగా తలపెట్టిన వాటిలో హగరి (వేదవతి ప్రాజెక్టు) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను 900 కోట్ల రూపాయలతో, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్ డీఎస్) రైట్ కెనాల్ పనులను 1485 కోట్ల రూపాయలు, గుండ్రేవులు రిజర్వాయర్ పనులను 2800 కోట్ల రూపాయలు , కృష్ణా నదిపై కొత్త బ్యారెజ్ నిర్మాణం (10 టీఎంసీ నిల్వ కోసం) 2169 కోట్ల రూపాయలు, ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 498 కోట్ల రూపాయలు, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ఫేజ్ 1 కింద 6020 కోట్ల రూపాయలు, విస్సన్నపేట-చందుబండ లిఫ్ట్ ఇరిగేషన్ 500 కోట్ల రూపాయలు, వరికపూడిసల లిఫ్ట్ ఇరిగేషన్ 640 కోట్ల రూపాయలు, వంశధార-బహుడా నదుల అనుసంధానం 1050 కోట్ల రూపాయలు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు పలు చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇప్పటికే చేసిన పలు దోపిడీలకు ఇది అదనం అన్న మాట.