చంద్రబాబు సమావేశానికి మాయా..అఖిలేష్ డుమ్మా

జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు కాంగ్రెస్ తో కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద దెబ్బే తగిలింది. దేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన కీలకమైన పార్టీలు అయిన సమాజ్ వాదీ, బీఎస్పీలు ఈ సమావేశానికి డుమ్మాకొట్టాయి. ఈ రెండు పార్టీలు లేకుండా మోడీ వ్యతిరేక ఫ్రంట్ కు ఒక రూపు రాదనే విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కతాటిపైకి తేగలిగితేనే మోడీని ఢీకొట్టడం సాధ్యం అవుతున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన నూతన ఫ్రంట్ మీటింగ్ కు యూపీ నేతలు తప్ప అందరూ హాజరయ్యారు.
పార్లమెంట్ అనుబంధ హాల్ లో జరిగిన ఈ సమావేశంలో సోనియాగాంధీతోపాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శరద్ పవార్, శరద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, డీఎంకె అధినేత స్టాలిన్, కమ్యూనిష్టు పార్టీ నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాందీ, చంద్రబాబునాయుడులు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తమ ప్రయత్నాలు కొనసాగుతాయని..లేకపోతే దేశానికి చాలా నష్టం అని వ్యాఖ్యానించారు. అన్ని వ్యవస్థలను మోడీ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లోపల, బయటా చేయాల్సిన ఆందోళలనపై చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు ప్రతిపక్ష నేతలు లందరూ కలసి రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపారు.