Telugu Gateway
Andhra Pradesh

మూడు నెలల ప్రచారానికి రూ. 200 కోట్లా!?

మూడు నెలల ప్రచారానికి రూ. 200 కోట్లా!?
X

ఏపీ సమాచార శాఖలో ‘భారీ దోపిడీకి ప్లాన్’

ఎన్నికలకు ఇంకా సమయం మిగిలింది కేవలం మూడు నెలలే. కానీ ఘనత వహించిన ఏపీ సమాచార శాఖ తమకు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ఏకంగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలని ప్రతిపాదించింది. ఫైలును సర్కారుకు పంపింది. అసలు ఈ సమయంలో ఇంత డబ్బు ప్రచారానికి ఏంటి? అని అవాక్కు అవటం అధికారుల వంతు అయింది. అయితే ఆర్థిక శాఖ కూడా అంత మొత్తం నిధులు ఇవ్వటానికి నిరాకరించి..రెండు వందల కోట్ల రూపాయల వరకూ అయితే ఓకే అని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏపీ సమాచార శాఖ పలు కుంభకోణాలకు నిలయంగా మారింది. మరి చివరి నిమిషంలో వందల కోట్ల రూపాయల యాడ్స్ ఎవరికి ఇస్తారు?. ఎలా ఇస్తారు. అంటే అంతా దోపిడీ పథకంలో భాగమనే అధికార వర్గాలు చెబుతున్నాయి. పక్కాగా ప్లాన్ రెడీ చేసుకునే ఈ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. దీని వెనక ‘ముఖ్య’ నేత కార్యాలయంలోని ఉన్నతాధికారులతో పాటు మరికొంత మంది పెద్దలు కూడా ఉన్నారని చెబుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమాచార శాఖ బడ్జెట్ కేటాయింపుల కంటే ఎన్నో రెట్లు అధికంగా..అదీ కేవలం కొన్ని నెలల ప్రచారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయటం..వీటిని ఓకే చేయటం వెనక మతలబు ఏమిటి?. ఎన్నికల సమయంలో అస్మదీయ సంస్థలకు భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటం ఒకెత్తు అయితే..ఔట్ డోర్ ప్రచారం..రకరకాల పేర్లు చెప్పి కోట్లాది రూపాయల నొక్కేయటం ఇందులో భాగమే అంటున్నారు. అసలు కింద నుంచి ఫైలు ఏమీ లేకుండానే సమాచార శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు నేరుగా ఆరున్నర కోట్ల రూపాయల ఆర్డర్ ను ఓ సంస్థకు ఇఛ్చారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రభుత్వంలోని ‘ముఖ్య నేత’ అండదండలతోనే ఇవన్నీ సాగుతున్నందునే ఆ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా చేసుకుపోతున్నారనే విమర్శలూ ఉన్నాయి. అసలు ఎక్కడా కన్పించకుండా ఉండి..ఎక్కువ మొత్తంలో దండుకునేందుకు స్కోప్ ఉన్న ప్రచారానికే ఎక్కువ మొత్తాలు ప్రతిపాదించారు. మరి ఇవి ఎలా ముందుకు సాగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it