సూరి హత్య కేసులో భానుకిరణ్ దోషే
సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ దోషే అని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. మద్దెలచెరువు సూరి మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సూరి హత్య కేసులో భానుకిరణ్ కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం నాడు తుది తీర్పు వెలువరించింది. దీంతోపాటు 20 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ కేసులో భానుకు సహకరించిన మన్మోహన్ సింగ్ కు అయిదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. సూరి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2011, జనవరి 3న సూరి, అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్ మధు జూబ్లీహిల్స్ నుంచి సనత్‌నగర్ వెళ్తుండగా నవోదయ కాలనీ సమీపంలో సూరిపై పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపి హతమార్చారనే ఆరోపణలపై కోర్టు ఈ తీర్పు ప్రకటించింది.
సీఐడీ సమర్పించిన ఆధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణ ఏడేళ్ల పాటు కొనసాగింది. 2011 జనవరి 4న సూరి తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య అనంతరం పరారైన భానును పోలీసులు మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆయన నుంచి తుపాకీ, మూడు సెల్ ఫోన్లు, బ్యాంకు ఏటీఎం కార్డుల స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి భానుకిరణ్ జైలులోనే ఉన్నారు. ఎన్నోసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.