అసెంబ్లీ సీట్ల పెంపు 2026 తర్వాతే
తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో జరిగే పనికాదని కేంద్రం తేల్చిచెప్పింది. రాజ్యసభలో సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోం శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం ఏపీలోనూ..తెలంగాణలోనూ అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. తెలంగాణలోని 119 స్థానాలను 153కు, ఏపీలోని 175 స్థానాలను 225కు పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు. ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు.
ఇద్దరు సీఎంలు వ్యక్తిగతంగా కలసి కూడా వినతిపత్రాలు అందజేశారు. అదుగో..ఇదుగో అంటూ ఇంత కాలం నాన్చిన కేంద్రం ఇప్పుడు అసలు విషయం తేల్చిచెప్పేసింది. ఇఫ్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే పూర్తి అయి కొత్త ప్రభుత్వం కొలువుదీరగా..మరో నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ తరుణంలో కేంద్రం చేసిన ప్రకటనపై అసెంబ్లీ సీట్ల పెంపుపై పార్టీలు పెట్టుకున్న ఆశలు పూర్తిగా నీరుగారినట్లు అయింది.