Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ తరపున గుంటూరు ఎంపీ బరిలో నాగార్జున!

వైసీపీ తరపున గుంటూరు ఎంపీ బరిలో నాగార్జున!
X

అక్కినేని నాగార్జున పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్నారా?. అంటే అవుననే చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నుంచి వైసీపీ తరపున అక్కినేని నాగార్జున బరిలో నిలచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నాగార్జునతోపాటు అమల పేరు కూడా ప్రచారంలోకి వచ్చినా..అంతిమంగా నాగార్జునకే ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నాగార్జున బహిరంగంగానే ఆయనకు మద్దతు ఇచ్చారు. జగన్ తరపున నాగార్జునను బరిలోకి దింపే అంశంపై హీరో సుమంత్ చర్చలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. సుమంత్, జగన్ సన్నిహితులు అన్న విషయం తెలిసిందే. వైసీపీలో ఉన్న సీనియర్లు చాలా మందిని ఎంపీలుగా పంపాలని జగన్ యోచిస్తున్నా..అందుకే చాలా మంది నేతలు అంత సుముఖత వ్యక్తం చేయటం లేదు.

అందుకే జగన్ లోక్ సభ అభ్యర్ధుల విషయంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించి..సరైన అభ్యర్ధులను ఎంపిక చేయటం ద్వారా ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. తొలుత గుంటూరు లోక్ సభ నుంచి విజ్ణాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు లావు కృష్ణదేవరాయలను బరిలో దింపాలని అనుకున్నారు. కానీ ఆయన్ను ఇప్పుడు నరసరావుపేటకు పంపనున్నట్లు చెబుతున్నారు. లోక్ సభ ఇన్ ఛార్జిగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి అల్లుడు రోశయ్య ఉన్నప్పటికీ సీటు మాత్రం అక్కినేని నాగార్జునకే దక్కుతుందని చెబుతున్నారు. అయితే చివరి నిమిషంలోనే ఈ పేరు ప్రకటించే అవకాశ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ లోక్ సభ నుంచి టీడీపీ తరపున గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it