Telugu Gateway
Andhra Pradesh

జగన్ హత్యకు రెక్కీ..విజయమ్మ సంచలన వ్యాఖ్యలు

జగన్ హత్యకు రెక్కీ..విజయమ్మ సంచలన వ్యాఖ్యలు
X

వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వై ఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తిదాడి ఘటన అనంతరం సోమవారం నుంచి జగన్ పాదయాత్రను తిరిగి ప్రారంభించనుండటంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. గుంటూరు, గోదావరి జిల్లాలో జగన్ ను అంతమొందించేందుకు రెక్కీ చేశారని..అది సాద్యం కాకపోవటంతో విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగిందని అన్నారు. వైఎస్ మరణం తర్వాత తమ కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉందని అన్నారు. విజయమ్మ వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...‘ వైఎస్‌ జగన్‌కు ఇది పునర్జన్మ. గొంతులో దిగాల్సిన కత్తి అదృష్టవశాత్తు భుజానికి తగిలింది. ప్రజల ప్రేమ, దీవెనలతోనే ఈ ప్రమాదం నుంచి జగన్‌ తప్పించుకున్నారు. వైఎస్సార్‌సీపీ తొలి ప్లీనరిలోనే నా కొడుకును మీకు అప్పజెప్పుతున్నానని ప్రకటించా. అప్పటి నుంచి ఆయన ప్రజల మధ్యనే ఉన్నాడు. ఓదార్పు యాత్రలో మీరే ఆయనను ఓదార్చారు. ప్రజా సమస్యలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా విషయంలో అనేక పోరాటాలు, దీక్షలు చేశారు.

ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర 11 జిల్లాల మీదుగా సుమారు 3200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇది ప్రజా ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. జగన్ తల్లి, భార్య, చెల్లెలిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మౌనంగా సహిస్తున్నాం.. భరిస్తున్నాం. రాజశేఖర్‌ రెడ్డి ఏ పార్టీకి అయితే 30 ఏళ్లు సేవ చేశాడో ఆపార్టీ ఆ మహానేతను దోషిని చేసింది.. ఇప్పటికి వేధిస్తోంది. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని వైఎస్‌ జగన్‌పై అన్నిదాడులు చేయించి 16 నెలలు జైలులో పెట్టారు. నాకు తెలిసి దేశంలో ఏ నాయకుడు ఇన్ని వేధింపులు ఎదుర్కోలేదు. అయినా జగన్‌ దేనికి చలించలేదు, అదరలేదు. ఈ సమస్యలన్నిటినీ పక్కన పెట్టి ప్రజల మధ్యే ఉండి పోరాడుతున్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగి 17 రోజులవుతోంది. అయినా ఈ కేసులో పురోగతి లేకపోగా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. వైఎస్ జగన్‌కు అయిన గాయం గురించి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు వెక్కిరిస్తూ మాట్లాడుతున్నారు. విచారణ జరపకుండా రోజుకో మాటతో పబ్బం గడుపుతున్నారు.

వీఐపీ లాంజ్‌లోనే భద్రతా లేకుంటే ఎలా అని అడుగుతున్నా. చిన్న గుండు సూది కూడా తీసుకుపోనివ్వని ఎయిర్‌పోర్ట్‌ లోకి ఏ విధంగా కత్తులు వెళ్లాయి? ఈ ఘటనకు ఎవరు సహకరించారనే దిశలో విచారణ ఎందుకు జరగడం లేదు. జగన్ అభిమాని దాడి చేశాడని డీజీపీ సంఘటన జరిగిన గంటలోనే ఎలా చెప్తారు? సీఎం అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడుతారు. అలిపిరి ఘటనలో ఆనాడు వైఎస్‌ఆర్‌ చంద్రబాబును పరామర్శించలేదా? గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలుపలేదా? ఇప్పుడు చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారు. కన్న కొడుకుపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించిన చరిత్ర వైఎస్సార్‌ది. జగన్‌పై దాడి చేసింది అభిమానే అంటూ రోజుకో రకం ప్లెక్సీలు సృష్టిస్తున్నారు. అభిమాని అయితే కలిసిన మొదటిసారే కత్తితో దాడికి దిగుతాడా? ఒకవేళ అభిమానే అయితే విచారణ చేయవద్దా? అని అడుగుతున్నా.

ఎయిర్ పోర్ట్ లో రెస్టారెంట్ ఓనర్ ను ఎందుకు విచారించరు. ఘటన జరిగిన చాలా సేపటి తర్వాత లేఖలు ఎలా వచ్చాయి. ముడతలు లేని లేఖలో మూడు నాలుగు రాతలు ఉన్నాయంటే మరో సమాధానం చెబుతారు. నిష్పాక్షికమైన విచారణ జరగాలని కోరుతున్నా. థర్డ్ పార్టీ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. చంద్రబాబుపై ఎప్పుడో దాడి జరిగితే...ఇప్పటికి జడ్ కేటగిరి భద్రత ఎందుకు పెట్టుకున్నారు. మరి ఆయనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదా? ఎవరైతే ఈ హత్యాయత్నం చేశారో వారికి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని చెబుతున్నాను. ఇప్పటికే వైఎస్ఆర్‌ను పోగొట్టుకొని బాధలోఉన్నాం. నా కొడుకును దూరం చేసి నా కడుపుకొట్టొద్దని మొక్కుతున్నా.’ అని విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు’.

Next Story
Share it