Telugu Gateway
Politics

సర్వే విషయంలోనే ‘లగడపాటి’తో గొడవైందా!?.

సర్వే విషయంలోనే ‘లగడపాటి’తో గొడవైందా!?.
X

తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎందుకు ప్రత్యక్షం అయ్యారు?. ఆయన చేసిన సర్వే అంశమే ప్రస్తుతం వివాదానికి కారణం అయిందా?. అంటే అవుననే చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు. అసెంబ్లీ రద్దు సమయంలో లగడపాటి తెలంగాణ ప్రాంతంలో సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారం అప్పట్లో వాతావరణం అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంది. కానీ తర్వాత పరిస్థితులు వేగంగా మారుతూ వస్తున్నాయి. ఈ దశలో లగడపాటి తెలంగాణ సర్వేను బహిర్గతం చేయాలని కొంత మంది రాజకీయ పెద్దలు ఒత్తిడి చేయటం.. మారిన పరిస్థితుల్లో అందుకు లగడపాటి నిరాకరించటంతో ప్రస్తుతం ఆయన ‘టార్గెట్’గా మారారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజకీయంగా లగడపాటి రాజగోపాల్ ఎంత వివాదస్పదుడు అయిననా సర్వేపరంగా ఆయనకు ఓ విశ్వసనీయత ఉంది. ప్రస్తుతం తాను ఒకటి చెప్పి..తర్వాత మరొకటి జరిగితే ఇబ్బంది అని భావించి సర్వే విషయాలను బహిర్గతం చేయటానికి లగడపాటి సిద్ధపడలేదని..ఇదే ప్రస్తుతం వివాదానికి కారణం అయిందని చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సర్వేను బహిర్గతం చేయటానికి లగడపాటి సిద్ధపడకపోవటం కొంత మంది ‘పెద్దల’కు నచ్చలేదు.

ఇటీవలే జూబ్లిహిల్స్ ప్రాంతంలో నివాసం ఉండే జీ పీ రెడ్డి అనే వ్యాపారవేత్త ఇంట్లో పోలీసులు రాత్రివేళ తనిఖీలు నిర్వహించటం వివాదం అయింది. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన లగడపాటి రాజగోపాల్ సెర్చ్ వారంట్ లేకుండా నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ఎలా తనిఖీలు చేస్తారని ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు..ఎన్నికల సంఘంతోపాటు గవర్నర్ కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. జీ పీ రెడ్డితో లగడపాటి రాజగోపాల్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిజంగా జీపీ రెడ్డి తప్పు చేసి ఉంటే వారంట్ తో సెర్చ్ చేసుకోవటంతో చట్టపరంగా చర్యలు తీసుకున్నా ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ రాత్రివేళ్ళలో వచ్చి తనిఖీ చేయటంపైనే వివాదం రాజుకుంది. అయితే ఇప్పుడు కొంత మంది తెరపైకి వచ్చి లగడపాటిని అరెస్టు చేయాలనే డిమాండ్ ప్రారంభించారు. ఈ మొత్తం వివాదం వెనక ‘తెలంగాణ ఎన్నికల సర్వే’దే ప్రధాన పాత్ర అని చెబుతున్నారు.

Next Story
Share it