Telugu Gateway
Politics

ఉత్తమ్ పై చర్యలకు కెసీఆర్ కు టైం చాలలేదా?

ఉత్తమ్ పై చర్యలకు కెసీఆర్ కు టైం చాలలేదా?
X

మంత్రిగా ఉన్న భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవటానికి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ కు నాలుగున్నర సంవత్సరాల సమయం చాలలేదా?. ఆధారాలు ఉన్నా ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కెసీఆర్ వదిలేసినట్లు?. సాక్ష్యాత్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో గృహనిర్మాణ శాఖలో 5000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కెసీఆర్ ఆరోపించారు. అధికారంలోకి ఉండగా కూడా పలుమార్లు హౌసింగ్ స్కామ్ పై ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు..మంత్రి కెటీఆర్ లు కూడా విమర్శలు చేశారు. ఈ స్కామ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర కూడా ఉందని బహిరంగంగానే చెప్పారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేసిన కెసీఆర్..మళ్ళీ అధికారంలోకి వస్తే ఉత్తమ్ పై చర్యలు తీసుకుంటామని చెపితే ఎవరైనా నమ్ముతారా?. గతంలో కూడా కెసీఆర్ ఓ సారి చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అంటారని ఊరుకున్నామని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అవినీతిపై చర్యలు తీసుకోవటానికి ఆధారాలు కావాలి కానీ..కక్ష సాధింపు చర్యలు అంటారని వదిలేస్తారా?.

కెసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల డీరిడిజైనింగ్ తో పాటు ఎన్నో ప్రాజెక్టులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాత్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టులపై అవినీతి ఆరోపణలు చేశారు. కెసీఆర్ చెబుతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో హౌసింగ్ మంత్రగా ఉన్నప్పుడు భారీ కుంభకోణానికి పాల్పడి కూడా తన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కెసీఆర్ వదిలేశారా?. అసలు ఇది కెసీఆర్ స్వభావమే కాదని.. పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గత కొంత కాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ప్రభుత్వంలోని పెద్దలకు అత్యంత సన్నిహితుడు అయిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే కెసీఆర్ హౌసింగ్ స్కామ్ లో ఆధారాలు ఉన్నా కూడా వదిలేశారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో కెసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తటం విశేషం.

Next Story
Share it