గతం మర్చిపోతాం..భవిష్యత్ కోసం పనిచేస్తాం..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఉమ్మడి ప్రకటన ఇది. ఢిల్లీలో వీరిద్దరి భేటీ గంట పాటు సాగింది. అనంతరం ఇద్దరూ కలసి మీడియా ముందుకు వచ్చారు. బిజెపిని ఓడించాలి..దేశాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. కూటమికి నాయకుడు ఎవరూ ఉండరని..అందరం కలసి పనిచేస్తామని తెలిపారు. బిజెపి పాలనలో రాఫెల్ అతిపెద్ద కుంభకోణం అని..30 వేల కోట్ల రూపాయలను అనిల్ అంబానీ కంపెనీకి దోచిపెట్టారని రాహుల్ మరోసారి ఆరోపించారు. ప్రస్తుత పరిణామాలపైనే తాము దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాహుల్ గాంధీ సమావేశం ఎంతో బాగా జరిగిందని అన్నారు. ‘సేవ్ నేషన్..సేవ్ డెమాక్రసీ’ అనేదే తమ ప్రధాన ఏజెండా అని తెలిపారు. అన్ని పార్టీలతో కలసి దీనిపై పనిచేస్తామన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చించాలని రాహుల్ గాంధీకి సూచించినట్లు తెలిపారు. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యం అన్నారు. ప్రధాని మోడీ హయాంలో వ్యవస్థలు అన్నీ ధ్వంసం అయ్యాయని అన్నారు. ఆర్ బిఐ, సీబీఐ తోపాటు అన్నీ వ్యవస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో అందరం చూస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.