ప్రజలకు ఇష్టం లేకపోతే వ్యవసాయం చేసుకుంటా

కొద్ది రోజుల క్రితం ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకేమీకాదని..ఇంట్లో రెస్ట్ తీసుకుంటానని వ్యాఖ్యానించి కలకలం రేపారు. తెలంగాణనే నష్టపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపాయి. తాజాగా ఆర్ అండ్ బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ఇష్టం లేకపోతే వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉండే పార్టీలే తెలంగాణలో రాజకీయం చేయాలి. పక్క రాష్ట్ర పార్టీలు తెలంగాణలో ఎందుకంటూ వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కేంద్రానికి లేఖలు రాసింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాదా అంటూ ప్రశ్నించారు. టీడీపీని వీడేటప్పుడు చాలా బాధపడ్డానని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అన్నారు. ఈ సారి జిల్లా ప్రజలు తనను గెలిపిస్తే సీతరామ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తానని తెలిపారు.