Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ ఓడిపోతే నాకేమీ కాదు..ఇంట్లో రెస్ట్ తీసుకుంటా!

టీఆర్ఎస్ ఓడిపోతే నాకేమీ కాదు..ఇంట్లో రెస్ట్ తీసుకుంటా!
X

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకేమీ నష్టంలేదని..ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకుంటానని అన్నారు. నష్టపోయేది తెలంగాణ ప్రజలే అని వ్యాఖ్యానించారు. వచ్చినోడు ఏదో ఒకటి చేసుకుంటాడని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్ళకు తనను ఓడించటం చేతకాక..అమరావతికి పోయి చంద్రబాబును తీసుకొస్తున్నారని విమర్శించారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా అమరావతికి గులాంలుగా...ఢిల్లీకి గులాంలుగా ఉండాలా? అని ప్రశ్నించారు. కూటమి టిక్కెట్ల పంచాయతీ చూశారు కదా.?ఎలా అయిందో. కూటమి అంటడు. ఒక్కో పార్టీ వాడు ఒక మేనిఫెస్టో ప్రకటిస్తడు. ఇదెక్కడి కథ. ఎవరు సీఎం అవుతరో..సీల్డ్ కవర్ లో ఎవరు పేరు వస్తదో..వచ్చేవాడు వీటన్నింటిని అమలు చేస్తడా?. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యుత్ సమస్యతో ఆగమాగం అవుతుందని చెప్పారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా కరంట్ పక్కాగా సరఫరా చేసుకున్నాం. మేం చేయగలిగింది మీరెందుకు చేయలేకపోయారు?. మళ్లీ చంద్రబాబు వస్తే తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడనిస్తడా?. జాగ్రత్తగా ఆలోచించండి.

చిన్న చిన్న విభేదాలు ఉన్నా పక్కన పెట్టి రాష్ట్రం కోసం పనిచేయండి అని పార్టీ నేతలకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కెసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు విచక్షణతో ఓటు వేయాలన్నారు. స్థానిక మీడియా ప్రతినిధులు ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. 58 సంవత్సరాలు పాలించిన పాలకులు అన్ని సమస్యలను పెండింగ్ లో పెట్టారని..తాను వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశానని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు నిధులు ఇఛ్చేదిలేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే కాంగ్రెస్ వాళ్లు మాట్లాడలేదని..తామే గట్టిగా పోరాడామని తెలిపారు.

Next Story
Share it