ఫైలింగ్ ముగిసింది..ఫైటింగ్ మిగిలింది

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కీలక ఘట్టం పూర్తయింది. అత్యంత ముఖ్యమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం మధ్యాహ్నాం మూడు గంటలకు ముగిసింది. ఇంత కాలం అన్ని పార్టీలు అభ్యర్ధుల ఖరారుకు నానా తంటాలు పడ్డాయి. గెలుపు గుర్రాలను ఎంపిక చేయటం, అదే సమయంలో రెబెల్స్ లేకుండా చూసుకోవటం కోసం నానా కసరత్తు చేశాయి. అయినా సరే అన్ని పార్టీల్లో ఎంతో కొంత అలకలు..బుజ్జగింపులు సాగుతున్నాయి. నామినేషన్ల ఫైలింగ్ ముగియటంతో ఇక కీలకమైన ఫైటింగ్ మాత్రమే మిగిలింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రచార వేగంగా పెంచింది.
అంతే కాదు..ఏకంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. మంగళవారం నుంచి ప్రచారం తెలంగాణలో మరెంత హోరెత్తనుంది. నామినేషన్ల చివరి రోజు అయిన నవంబర్ 19 నాటికి 119 నియోకకవర్గాలకు ప్రాధమిక అంచనా ప్రకారం 2500 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అంచనా. సోమవారం మంచి రోజు కావటంతో కీలక నేతలు అందరూ నవంబర్ 19న నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈనెల 22 వరకు గడువు ఉంది. డిసెంబర్ 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11న ఓట్లను లెక్కిస్తారు.