Telugu Gateway
Telangana

అర్థరాత్రి పారిశ్రామికవేత్త ఇంట్లో పోలీసుల తనిఖీలు

అర్థరాత్రి పారిశ్రామికవేత్త ఇంట్లో పోలీసుల తనిఖీలు
X

తెలంగాణ పోలీసుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఎలాంటి వారంట్ లేకుండా అర్థరాత్రి ఓ వ్యాపారవేత్త ఇంట్లోకి ప్రవేశించటం..అదీ ఏకంగా బెడ్ రూమ్ తలుపులు కొట్టి పారిశ్రామికవేత్తను పోలీసు స్టేషన్ కు రావాలని కోరటం దుమారం రేపుతోంది. ఈ తతంగం అంతా గురువారం రాత్రి పది గంటలకు మొదలై అర్థరాత్రి వరకూ సాగింది. నగరంలోని జూబ్లిహిల్స్ లో నివాసం ఉండే పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అది కూడా ఎలాంటి తనిఖీ వారెంట్ లేకుండా. జీపీరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హడావుడిగా అక్కడకు చేరుకుని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అధికారంలోకి ఇలా చేస్తున్నారని లగడపాటి పోలీసులతో వాదనకు దిగారు. సివిల్ కేసులో పోలీసులు ఇలా అర్థరాత్రి ఇలా చేయటం ఏ మాత్రం సరికాదని మండిపడ్డారు. ఈ అంశంపై గవర్నర్ కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తనిఖీలకు వచ్చిన అధికారులు లగడపాటి అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల ఫోను నుంచే లగడపాటి కూడా అధికారులతో మాట్లాడి..ఈ తీరును తప్పుపట్టారు. ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే అర్థరాత్రి ఇలా ఇంటిపైకి వచ్చారని లగడపాటి ఆరోపించారు.

ఈ కేసు పూర్తిగా సివిల్ వ్యవహారం అన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరూ బదిలీ చేయరని ఇలా చేస్తున్నారా? అంటూ లగడపాటి పోలీసులను ప్రశ్నించారు. చట్టాలు తనకు బాగా తెలుసని..కానీ పోలీసులకు ఉన్న విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైననా అరెస్టు చేయాలనుకుంటే సాధ్యంకాదన్నారు. అవసరం అయితే పోలీసులపై కేసు కూడా పెడతామని హెచ్చరించారు. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఐపీఎస్ అధికారికి చెందిన భూమి తప్పులు ధృవపత్రాలు సృష్టించారని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే 20 సార్లు పైగా స్టేషన్ కు వెళ్లి పోలీసులు అడిగిన సమాచారం అందజేశారు. ఈ వ్యవహారాన్ని ఐజి నాగిరెడ్డితో సెటిల్ చేసుకోవాలని తన స్నేహితుడిని బెదిరిస్తున్నారని లగడపాటి ఆరోపించారు. పోలీసులు ఇలా చేస్తుంటే తెలంగాణలో ఎన్నికలు స్వేచ్చగా..నిష్పక్షపాతంగా జరుగుతాయని ఎలా భావించగలమని లగడపాటి మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలీసుల తీరుపై జీపీ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it