ట్యాక్సీవాలా మూవీ రివ్యూ
విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ కు చిరునామాగా మారాడు. ఈ కుర్ర హీరో ఏ సినిమా చేసినా క్రేజ్ అదే స్థాయిలో కొనసాగుతోంది. విజయ్ కు కలిసొచ్చే అంశం ఏంటంటే ఆయన చేసిన సినిమా ఏదీ కూడా అట్టర్ ఫ్లాప్ అనే పరిస్థితి ఉండటం లేదు. గీత గోవిందం సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోగా..నోటా మాత్రం ఓ మోస్తరు టాక్ తో సరిపెట్టుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా అంటూ ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి పలు తేదీలు మారటం..విడుదలకు ముందే సినిమా నెట్ లో విడుదల కావటంతో దీనిపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కొత్త కథను ఎంచుకుని విజయ్ తనదైన మార్క్ నటనతో మరో సారి హిట్ కొట్టాడనే చెప్పొచ్చు. ట్యాక్సీవాలా సినిమా ఫస్టాఫ్ అంతా సాఫీగా..హాయిగా సాగిపోతోంది. సెకండాఫ్ లో కాస్త స్లో అయినట్లు అన్పించినా ట్యాక్సీవాలా తో విజయ్ ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు. సినిమా అసలు కథ విషయానికి వస్తే శివ (విజయ్ దేవరకొండ) అతి కష్టమీద ఐదేళ్లపాటు చదివి డిగ్రీ పూర్తిచేస్తాడు.అన్నా వదినలకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్(మధు నందన్) దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చేస్తాడు. ముందు ఒకటి రెండు జాబ్స్ ట్రై చేసిన వర్క్ అవుట్ కాకపోవటంతో క్యాబ్ డ్రైవర్‌గా పని చేయాలనుకుంటాడు. తన వదిన బంగారం అమ్మి ఇచ్చిన డబ్బుతో ఓ పాత కారును కొని టాక్సీగా మారుస్తాడు.
టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ పరిస్థితుల్లో శివ ఏం చేశాడు..? అసలు టాక్సీలో ఉన్న ఆ పవర్ ఏంటి..? ఈ కథతో అను (ప్రియాంక జవాల్కర్), శిశిర (మాళవిక నాయర్)లకు ఉన్న సంబంధం ఏంటి..? అన్న సస్పెన్స్ తో సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్ రోల్ తో ఆకట్టుకుంది. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్ మంచి కామెడీ టైమింగ్‌తో అలరించాడు. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యం ఫస్ట్ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ ఎంటర్‌టైన్మెంట్ కాస్త తగ్గినా మార్చురీ సీన్ సూపర్బ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ఓవరాల్ గా చూస్తే ట్యాక్సీవాలా సరదాగా సాగిపోయే సినిమా.
రేటింగ్. 2.75/5