Telugu Gateway
Politics

హరీష్ ను వారసుడిగా ప్రకటిస్తారా?

హరీష్ ను వారసుడిగా ప్రకటిస్తారా?
X

ఎన్నికలకు సమయం దగ్గరకొస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎత్తులు..పైఎత్తులు వేసుకుంటూ ప్రత్యర్ధి పార్టీల్లో వీలైతే ఎంత గందరగోళం సృష్టించాలో అంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మహాకూటమిని అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే అంతా తానై నడిపిస్తున్నారని ప్రచారం చేయటం ద్వారా ‘సెంటిమెంట్ ’ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్, టీడీపీలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులో భాగంగానే గజ్వేల్ నుంచి పోటీచేయనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి లు టీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత విభేదాల అంశాన్ని ఎత్తిచూపుతున్నారు. అందులో భాగంగా రేవూరి ప్రకాష్ రెడ్డి తాజాగా మరోసారి ‘హరీష్’ని కేంద్రం చేసి మాట్లాడారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ వారసుడిగా హరీష్ రావు పేరును ప్రకటిస్తే తన వ్యాఖ్యలను భేషరతుగా వెనక్కి తీసుకుంటానని రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా మంత్రి కెటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొలి నుంచి కెసీఆర్ అండగా..పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన హరీష్ రావును కెసీఆర్ వారసుడిగా ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్నించారు. నీతి, నిజాయతీ నిరూపించుకోవాలంటే ఆ పని చేయండి అని సవాల్ విసిరారు. టీడీపీని ఇష్టానుసారం విమర్శిలే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాబోయే రోజుల్లో మహాకూటమి వైపు నుంచి చంద్రబాబు, టీఆర్ఎస్ తరపున ‘హరీష్ రావు’ చుట్టూ రాజకీయాలు తిరగటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it