Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ లో భారీ కుదుపు!

టీఆర్ఎస్ లో భారీ కుదుపు!
X

అధికార పార్టీలో అనుకోని కుదుపు. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ వంద సీట్ల నినాదంతో దూసుకెళతామని చెబుతుంటే..ఆ స్పీడ్ కు పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్నాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో జరుగుతున్న ఈ పరిణామాలు టీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురిచేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక ఎంపీలు గుడ్ బై చెప్పటానికి రంగం సిద్ధం చేసుకోవటంతో ఈ ప్రభావం ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందనే ఆందోళన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ లు టీఆర్ఎస్ ను వీడటానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. వీరితోపాటు కొంత మంది ఎమ్మెల్సీలతోపాటు కీలక నేతలు కూడా ఉంటారని చెబుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏకంగా కెసీఆర్ కు సవాల్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలతో టీఆర్ఎస్ కు మైండ్ బ్లాంక్ అవటం ఖాయం అని..చేతనైతే అడ్డుకోవాలని రేవంత్ సవాల్ విసరటం రాజకీయ వేడిని మరింత రాజేస్తోంది.

కొడంగలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. గతంలోనే ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగినా..అప్పట్లో పార్టీ మార్పు వార్తలను ఆయన ఖండించారు. ఏకంగా ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్ కు చేరుతున్నారంటే క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కు ఎదురుగాలి ఉందనే సంకేతాలు వెళతాయని..ఇది ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపించటం ఖాయం అనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ఎదురీదాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ తరుణంలో కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్ణయం మరింత షాక్ గా మారటం ఖాయం. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సన్నివేశాలు ‘హై ఓల్టేజ్’ సన్నివేశాలను చూపించబోతున్నాయి.

Next Story
Share it