Telugu Gateway
Politics

కర్ణాటకలో బిజెపికి షాక్

కర్ణాటకలో బిజెపికి షాక్
X

ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో కర్ణాటక ఉప ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి షాక్ ఇచ్చాయి. లోక్ సభకు కాలపరిమితి ఇంకా ఏడాదే ఉన్నా..అవసరం లేకపోయినా ఉప ఎన్నికలు పెట్టిన బిజెపి ఇప్పుడు చిక్కుల్లో పడాల్సి వచ్చింది. కర్ణాటకలో తాజాగా మూడు లోక్ సభ, రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగ్గా..కేవలం బిజెపి ఒక్క ఎంపీ సీటును మాత్రమే దక్కించుకోగలింది. మిగిలిన సీట్లు అన్నీ కాంగ్రెస్-జెడీఎస్ కూటమి దక్కించుకుంది. బిజెపికి అత్యంత కీలకమైన బళ్ళారి పార్లమెంట్ సీటును బిజెపి దక్కించుకోలేకపోయింది. 2004 ఎన్నికల నుంచి ఇక్కడ బిజెపినే గెలుస్తూ వస్తోంది. తాజా ఉప ఎన్నికలో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పలేదు. ఇది బిజెపి సిట్టింగ్ సీటు కావటం విశేషం. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు నేడు (మంగళవారం) ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ స్థానాలకు గత శనివారం ఉప ఎన్నిక నిర్వహించారు. మండ్య లోక్‌ సభ స్థానాన్ని జేడీఎస్‌ కైవసం చేసుకుంది. రామ్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో కుమార స్వామి భార్య అనిత విజయం సాధించారు. జామ్‌ఖండి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ సిద్ధు గెలిచారు.

ఇక బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఐదు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక స్థానం మాత్రమే గెలిచుకుంది. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్‌ నుంచి మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర 50వేల ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. కొంతలో కొంత ఈ విజయంతో బిజెపి పరువు నిలబెట్టుకున్నట్లు అయింది.

Next Story
Share it