Telugu Gateway
Politics

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ సంఘ్ పరివార్ అని వ్యాఖ్యానించారు. ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ బిజెపితో కలసి ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లక్ష్యం మళ్ళీ కేంద్రంలో మోడీని ప్రధానిని చేయటమే అన్నారు. కెసీఆర్ సపోర్ట్ లేకుండా మోడీ ఏమీ చేయలేరని అన్నారు. కెసీఆర్ నిజమైన తెలంగాణ వాది అయితే మోడీకి మద్దతు ఇచ్చేవారు కాదని అన్నారు. తెలంగాణ సీఎం కెసీఆర్ రాఫెల్ కుంభకోణం గురించి ఒక్కసారైనా అయినా మాట్లాడారా?. సీఎం ఆదేశాల మేరకే తాము బిజెపికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు తనతో చెప్పారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే ప్రజా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని.. ఈ గాలిలో కెసీఆర్ ఓటమి ఖాయమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

రాహుల్ బుధవారం నాడు కొడంగల్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ సమయంలో బలమైన గాలి వీస్తుండటంతో రాహుల్ ..ఈ గాలి కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చుతుందని అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉందని..ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ తెలంగాణాను అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ ఆశలు..కలలు నెరవేరతాయని భావించారని..కానీ కెసీఆర్ వాటిని వమ్ము చేశారన్నారు. నిధులు, నీళ్ళు, నియామకాల విషయంలో కెసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమైందని అన్నారు.

మిషన్ భగీరథతోపాటు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో భారీ ఎత్తున దోపిడీ సాగిందని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రెండు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు కానీ..కెసీఆర్ తనయుడు కెటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగిందని రాహుల్ విమర్శించారు. నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కెసిఆర్ తన కుటుంబంలోని నలుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ నలుగురు రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేశారని ఆయన అన్నారు.కాంగ్రెస్ డ్వాక్రా గ్రూపులను ఆరంబిస్తే, కెసిఆర్ వారికి మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దక్కించుకోబోతుందని తెలిపారు.

Next Story
Share it