Telugu Gateway
Cinema

టాలీవుడ్ లో అసలు ‘మీ టూ’లే లేవా?!

టాలీవుడ్ లో అసలు ‘మీ టూ’లే లేవా?!
X

తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారి అంత స్వచ్చంగా మారిపోయిందా?. ఇక్కడ హీరోయిన్లు..క్యారెక్టర్ ఆర్టిస్టులకు అసలు వేధింపులే లేవా?. పరిశ్రమలోని హీరోలు..నటులు అంతా పూర్తి మంచి వారిగా మారిపోయారా?. ఇదే ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు తమిళ, మళయాళ, కన్నడ సినీ పరిశ్రమల్లో ‘ మీ టూ’ ప్రకంపనలు రేపుతుండగా..తెలుగు సినీ పరిశ్రమ మాత్రం అంతా గప్ చుప్ గా ఉంది. అసలు పరిశ్రమలో ఏమి జరుగుతోంది అనే విషయంపై ‘తెలుగు గేట్ వే. కామ్’ ఆరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే తెలుగు పరిశ్రమలో ఎక్కువగా ఈ వ్యవహారాలు అన్నీ ‘సర్దుబాటు’తో ముందుకు సాగుతున్నాయని..అందుకే ఇక్కడి వ్యవహారాలు ఏమీ బయటకు రావటం లేదని పరిశ్రమ ప్రముఖుడు ఒకరు చెప్పారు. ఇటీవల వరస సక్సెస్ లు అందుకుంటున్న యువ హీరో ఒకరు పరభాషా హీరోయినన్ తో అభ్యంతరకరంగా ప్రవర్తించారు.

చిర్రెత్తుకొచ్చిన ఆమె ఇక సినిమా చేసేదిలేదంటూ ఫ్లైటెక్కి సొంత రాష్ట్రానికి చేరుకుంది. ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేయటానికి ఆ చిత్ర నిర్మాత నానా తంటాలు పడాల్సి వచ్చింది. అంతే కాదు..షూటింగ్ పూర్తయ్యేంత వరకూ తాను కూడా పక్కనే ఉంటానని హామీ ఇచ్చి..ఈ వివాదం బయటకు పొక్కకుండా చేసేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. గతంలో ఓ సారి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పై అప్పారావు డ్రైవింగ్ స్కూల్ లో నటించిన మాళవిక ఆరోపణలు చేయటం అప్పట్లో పెద్ద కలకలం రేపింది. ఇదే తరహాలో హీరో నవదీప్ పై హీరోయిన్ అంకిత కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో నవదీప్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె అప్పట్లో మీడియాకు కూడా ఎక్కారు. రాధికా ఆప్టే అయితే తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోపై బహిరంగంగానే పలుమార్లు స్పందించింది.

కొంత మంది టాప్ హీరోలు హీరోయిన్లపై చేసే వేధింపులకు సంబంధించిన అంశంపై మధ్యవర్తులుగా పలు సందర్భాల్లో బడా బడా దర్శకులు, నిర్మాతలే వ్యవహరించి సర్దుబాటు చేసిన సందర్భాలు ఎన్నో. ఈ వ్యవహారాల్లో పాత్రదారులు కేవలం కొంత మంది హీరోలే కాదు సుమా. ప్రముఖ దర్శకులు..బయట నీతులు చెప్పటంలో ముందుండే వారు కూడా ఈ వేధింపుల జాబితాలో ఉన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో అయితే ఓ ప్రముఖ దర్శకుడు రాజకీయ నేతల జోక్యంతో జూబ్లిహిల్స్ ప్రాంతంలో ఉండే ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ ను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ ముఖ్యుడు వెల్లడించారు. చాలా మంది దర్శకులు, హీరోలు అయితే తమ మాట వినని హీరోయిన్లకు తదుపరి చిత్రాల్లో ఏ మాత్రం ఛాన్స్ లు రాకుండా చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమలో ఎన్ని జరిగినా కూడా ఏదీ బయటకు రాదు. ఎందుకంటే ఇక్కడ ‘సర్దుబాటు స్పెషలిస్టులు’ ఎక్కువ అని చెబుతున్నారు.

Next Story
Share it