చంద్రబాబు కంటే నారా దేవాన్ష్ ఆస్తులెక్కువ!
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆస్తులు 2.9 కోట్లు. దేశ రాజకీయాల్లో ఆయనే సీనియర్. ఈ విషయాన్ని చంద్రబాబే పదే పదే చెబుతారు. చంద్రబాబు ఆస్తి కేవలం 2.9 కోట్ల రూపాయలు ఉంటే...ఆయన మనవడు..నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ఆస్తి మాత్రం ఏకంగా 18.71 కోట్ల రూపాయలు ఉంది. ఇదెక్కడి విచిత్రమో అర్థం కాదు. ఎప్పటిలాగానే చంద్రబాబు ఫ్యామిలీ తరపున ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. రాజకీయాల్లో పారదర్శకత కోసమే తాము ఇలా చేస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ నారా దేవాన్ష్ ఆస్తులు దాదాపు కోట్ల రూపాయలు..చంద్రబాబు ఆస్తులు కేవలం 2.9 కోట్ల రూపాయలు అని చెప్పటంతోనే వీటి పారదర్శకత స్థాయి ఏంటో అట్టే అర్థం అవుతుంది. ఇలా చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తులు ప్రకటించటం ఇది 8వ సారి.
తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 2.9 కోట్లు అయితే.. నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 31.01 కోట్లు. నారా లోకేష్ ఆస్తి వివరాలు రూ. 21.40 కోట్లు. నారా బ్రాహ్మణి ఆస్తి విలువ రూ. 7.72 కోట్లు. హెరిటేజ్ సంస్థ నికర లాభం రూ. 60.38 కోట్లు. హైదరాబాద్‌లో ఇంటి విలువ రూ.8 కోట్లు. నారావారిపల్లెలో నివాసం విలువ రూ. 23.83 లక్షలు. నారా దేవాన్ష్ ఆస్తి విలువు రూ. 18.71 కోట్లుగా పేర్కొన్నారు. నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు రూ. 6.83 కోట్లు. చంద్రబాబు అప్పులు రూ.5.31 కోట్లు. భువనేశ్వరి అప్పులు రూ. 22.35 కోట్లు.’’ అని లోకేశ్ తెలిపారు. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా..లేకున్నా ఆస్తుల వివరాలు ప్రకటించామని లోకేశ్ చెప్పారు. తమపై ఆరోపణలు చేసే వారు తమ ఆస్తులు బహిర్గతం చేసి మాట్లాడాలన్నారు.