కెసీఆర్ పై మోడీ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ ఎక్కువ అభద్రతా భావంతో ఉంటారని..అందుకే ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముకుంటారని ఎద్దేవా చేశారు.అంతే కాదు.. కేసీఆర్ నిమ్మ, మిరపకాయలను నమ్ముతారు అంటూ అభినయిస్తూ మరీ చెప్పారు. కానీ ఆయన ఆత్మవిశ్వాసాని నమ్మరని వ్యాఖ్యానించారు. వాస్తు నమ్మకంతో కెసీఆర్ సచివాలయానికి దూరంగా ఉండటం...ఓ సారి ఆయుత చండీయాగం నిర్వహించిన కెసీఆర్..తాజాగా తన ఫాంహౌస్ లో మరో యాగం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా జ్యోతిష్యాన్ని నమ్ముకునే కెసీఆర్ ముందస్తుకు వెళ్లారని పార్టీలు ఆరోపిస్తున్న తరుణంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ అంతటా తాగునీళ్లు ఇచ్చాకే ఓటు అడుగుతానన్న కేసీఆర్.. ఐదేళ్లు పూర్తి కావొస్తున్నా నీళ్లు ఇవ్వలేదన్నారు. హామీలు మర్చిపోయిన కేసీఆర్‌ను ఇంటికి పంపాలని మోదీ పిలుపు ఇచ్చారు. తర్వాత మహబూబ్ నగర్ సభలో మాట్లాడుతూ కూడా కెసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ మొదట చంద్రబాబు దగ్గర అప్రెంటీస్ చేశారని, తర్వాత సోనియా గాంధీ దగ్గర అప్రెంటీస్ చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. సోనియా రిమోట్‌కంట్రోల్ ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేశారని, చెంచాగిరి చేసే వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటివారి చేతిలో మళ్లీ అధికారం పెడితే రాష్ట్రం అంధకారమే అవుతుందని అన్నారు. జనం మీద బుల్లెట్లు కురిపించిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టొద్దని, కాంగ్రెస్‌కు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవొద్దని, బలిదానాలు తీసుకున్న కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాకూడదని మోదీ పిలుపు ఇచ్చారు.