‘మహాకూటమి’ లెక్క తేలింది

ఎడతెగని చర్చలు. ఎంతకూ తేలని లెక్కలు. ఓ వైపు అధికార టీఆర్ఎస్ ఏకంగా 105 సీట్లు ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉండగా..మహాకూటమి ఇంకా ‘సీట్ల లెక్కల్లోనే’ మునిగిపోయింది. గురువారం నాడు ఢిల్లీలో ఎట్టకేలకు మహాకూటమి ‘లెక్క’ తేలింది. అయితే మరి ఈ సీట్ల కేటాయింపుపై తెలంగాణ జన సమితి (టీజెఎస్), సీపీఐలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సి ఉంది. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మొత్తం 119 సీట్లకుగాను 93 సీట్లలో బరిలో నిలవనుంది. తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు కేటాయించారు. టీజెఎస్ కు 8, సీపీఐకి 3 సీట్లు ఇచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచే సీట్లలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ 74 సీట్లలో అభ్యర్ధులకు ఖరారు చేసింది. గురువారం సోనియా నివాసంలో జరిగిన ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా 26 సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి జాబితా 74 మంది అభ్యర్ధులతో శనివారం విడుదల చేస్తామని వెల్లడించారు. ఈనెల11, 12న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో చర్చించిన తర్వాత మిగిలిన స్దానాల్లో పార్టీ అభ్యర్ధులను ఖరారు చేస్తామని కుంతియా పేర్కొన్నారు. ఈనెల 10న తొలిజాబితాను హైదరాబాద్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. 74 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ఈనెల 10న విడుదల చేయనున్న కాంగ్రెస్ పార్టీ మిగిలిన 20 స్థానాలపై వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తోంది. రెబల్స్ బెడదను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది. టికెట్ రాని నేతలకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది.