కెసీఆర్ నోట ఇప్పుడు ‘యుద్ధం’ మాట మతలబు ఏమిటో!
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ‘యుద్ధం’ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రోజూ తెలంగాణ యుద్ధం మిగిలే ఉంది అని చెప్పని కెసీఆర్ ఇప్పుడు ఆకస్మాత్తుగా ‘తెలంగాణ యుద్ధం’ మాటలను ఎందుకు తెరపైకి తెచ్చారు?. తెలంగాణ యుద్ధం అంటూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమిని ఓడించి..తిరిగి టీఆర్ఎస్ ను అధికారంలోకి తేవటమేనా?. లేక వేరే యుద్ధం ఏమైనా ఉందా?. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి..అద్భుతాలు చేయవచ్చు అని చెప్పిన కెసీఆర్ సొంత రాష్ట్రం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత కూడా యుద్ధం గురించి ప్రస్తావించటం ఏమిటి?. ఓ వైపు కెసీఆర్ తాను కడుపు కట్టుకుని పనిచేశానని చెబుతూనే..మరో వైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని..మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు అవినీతిపరులపై కొరడా ఝుళిపిస్తానని చెబుతున్నారు.
నిజంగా కెసీఆర్ అవినీతి లేకుండా పాలన చేస్తే..గతంలో అవినీతి చేసిన వాళ్ళను నాలుగున్నర సంవత్సరాల పాటు వదిలేస్తారా?. ఇలా చెపితే ఎవరైనా నమ్ముతారా?. కెసీఆర్ ప్రభుత్వంపై కూడా విపక్షాలు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. సర్కారు తలపెట్టిన కీలక కార్యక్రమాలైన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో భారీ ఎత్తున దోపిడీ సాగిందని కాంగ్రెస్ తోపాటు టీడీపీలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై నేరుగా పెద్దగా స్పందించని కెసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు తరహాలోనే అవినీతిరహిత పాలన అందిస్తున్నామని చెబుతున్నారు.