Telugu Gateway
Politics

మోడీ..చంద్రబాబుపై కెసీఆర్ ఫైర్

మోడీ..చంద్రబాబుపై కెసీఆర్ ఫైర్
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్రమోడీని ఎన్నోసార్లు కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని..ఆయనకు ఓ జబ్బు ఉందని వ్యాఖ్యానించారు. ఆయన మైనారిటీలు అంటే ఏదో అనుకుంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల తర్వాత తాను కేంద్ర రాజకీయాలపై దృష్టి పెడతానని..అంటే ఢిల్లీ వెళతానని కాదని..ఇక్కడే ఉండి కేంద్ర రాజకీయాలను మలుపు తిప్పుతామని ప్రకటించారు. కాంగ్రెస్, బిజెపియేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతీయ పార్టీల పని అయిపోయిందని పేర్కొన్నారు. ఇంకా తెలంగాణకు చంద్రబాబునాయుడు అవసరమా? అని కెసీఆర్ బుధవారం నాటి అన్ని సభల్లోనూ ప్రశ్నించారు. వచ్చేది చంద్రబాబునాయుడు అయితే..ఆయన్ను తెచ్చేది తెలంగాణ కాంగ్రెస్ అని తెలిపారు. ఆ పార్టీ అభ్యర్దులను ఓడిస్తే చాలు..తిట్టనక్కరలేదు..కొట్టనక్కరలేదు అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాను వలస జిల్లాగా మార్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు మరోసారి మహాకూటమి పేరుతో తెలంగాణలో చొరబడాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

‘మహబూబ్‌ నగర్‌ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్‌ కూడా కట్టలేదు. కానీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు పదే పదే అడ్డుపడుతూ కేంద్రానికి లేఖలు రాశారు. అలాంటి చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. ప్రజలు ఒకసారి ఆలోచించాలి. డిపాజిట్‌ రాకుండా ఓడగొట్టి చంద్రబాబుకు బుద్ది చెప్పాలి. ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు పాలమూరు ప్రాజెక్ట్‌పై 35 కేసులు వేసారు. భూసేకరణ విషయంలో ప్రజలకు అపోహలు సృష్టించి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అడుగడుగున అడ్డుపడ్డారు. పాత పాలమూరు జిల్లాను పాలన సౌలభ్యం కోసం నాలుగు జిల్లాలు చేసుకున్నాం. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. అప్పుడు 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చి చూపిస్తా. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చే రూ. 200 పింఛన్‌కు రూ.1000 ఇస్తానంటే.. అందరూ ఎలా ఇస్తావని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే అన్న మాట ప్రకారం ఇచ్చాం. మళ్లీ ఫించన్లు పెంచుతాం. ప్రపంచంలోనే ఎక్కడ లేని గొప్ప స్కీం రైతు బంధు.. వచ్చే ఏడాది నుంచి ఈ స్కీం కింద ఎకరానికి 10వేలు ఇస్తాం. రైతుల గిట్టుబాటు కోసం అద్భుత కార్యాచరణ చేశాం. కంటి వెలుగు, కేసీఆర్‌ కిట్‌తో ప్రజలకు అండగా నిలిచాం అని తెలిపారు.

Next Story
Share it