ఐటి ఉద్యోగాలపై లోకేష్ ‘దొంగ లెక్కలు’!
220 కంపెనీలతో ఎంవోయులు.. వచ్చిన పెట్టుబడి 744 కోట్లే
ఉద్యోగాల కల్పన కేవలం 6997 మాత్రమే
ఆంధ్రప్రదేశ్ లో ఐటి రంగం అభివృద్ధికి చెమటోడ్చుతున్నాం. దేశాల చుట్టూ తిరిగి కంపెనీలు తెస్తున్నాం. ఇప్పటికే 25 వేల వరకూ ఉద్యోగాలు కల్పించాం అని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పదే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఐటి రంగం ప్రమోషన్ పేరుతో సర్కారు సొమ్మును మాత్రం వందల కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. పోనీ ఆ రేంజ్ లో కంపెనీలు ఏమైనా ఏపీకి తెస్తున్నారా? అంటే అదీ లేదు. తెచ్చిన కంపెనీల్లోనూ స్కామ్ లు, దోపిడీలు. ఐటి శాఖలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ ఆ శాఖ చేసుకున్న అవగాహన ఒప్పందాలు మొత్తం 220 అయితే...ఇఫ్పటివరకూ అందుకున్న పెట్టుబడి మాత్రం 744 కోట్ల రూపాయలు మాత్రమే. ఐటి శాఖతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు ఇప్పటివరకూ కల్పించిన ఉద్యోగాల సంఖ్య కేవలం 6997 మాత్రమే. కానీ ఈ సంఖ్యను మంత్రి నారా లోకేష్ చాలా ఎక్కువ చేసి ప్రచారం చేసుకుంటున్నారు.
ఐటి శాఖలో జరుగుతున్న వాస్తవ పరిస్థితికి..ప్రచారానికి ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి కంపెనీలకు భూ కేటాయింపుల్లో సర్కారు భారీ స్కామ్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎంవోయులు కుదుర్చుకున్న వాటిలో ఏమైనా పెద్ద పేరున్న సంస్థలు ఉన్నాయా? అంటే అదీ లేదు. కానీ ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు నిత్యం అమెరికా పర్యటనలకు వెళుతూ ఐటి కంపెనీలను ఆకర్షిస్తున్నామని ప్రచారం చేసుకుంటారు. ప్రచారానికి క్షేత్రస్థాయిలో అమలుకు ఏ మాత్రం పొంతన ఉండటంలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.