Telugu Gateway
Politics

చంద్రబాబు అసలు ప్లాన్ అదే!

చంద్రబాబు అసలు ప్లాన్ అదే!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అకస్మాత్తుగా దేశాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చాయి. ఏపీలో అధికారంలో ఉండి నిరసన గళాలను అణగదొక్కుతున్న చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారా?. ఏపీ ప్రయోజనాల కోసం ప్రత్యర్ధి పార్టీ బంద్ లకు పిలుపునిస్తే పోలీసులను పెట్టి మరీ బంద్ లను విఫలం చేసిన చరిత్ర అందరూ చూసిందే. అంతే కాదు..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యయుతంగా ఏపీలో సమావేశం పెట్టుకుంటే..అసలు రాహుల్ ఏపీకి ఎలా వస్తారు అని వ్యాఖ్యానించి..అధికారంలోకి ఉండి కూడా ఆయనకు నల్లజెండాలతో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసిన ఇదే చంద్రబాబుకు ఇప్పుడు అకస్మాత్తుగా రాహుల్ గాంధీతో కలసి దేశాన్ని రక్షించాలనే యోచన ఎందుకు చేస్తున్నట్లు? అంటే చంద్రబాబు అంతిమ లక్ష్యం రాజకీయమే అని చెప్పకతప్పదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపునకు అప్పటి మోడీ పాజిటివ్ ఇమేజ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఉపయోగపడ్డాయన్నది బహిరంగ రహస్యం.

ఇప్పుడు బిజెపితో టీడీపీ రాం రాం చెప్పేసింది. జనసేన తనకు తాను టీడీపీకి దూరం అయింది. మరి గత ఎన్నికల్లో కలిసొచ్చిన ఈ ఓటింగ్ శాతాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి?. మిగిలిన ఏకైక పార్టీ కాంగ్రెస్. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం కనీసం నాలుగు శాతానికి అయినా చేరి ఉంటుందని అంచనా. జాతీయ స్థాయిలో పొత్తుల విషయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తున్నందున సీపీఐ ఖచ్చితంగా టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఉన్న బిజెపి, జనసేనలు ప్రస్తుతం దూరం కావటంతో జరిగిన నష్టాన్ని ఈ పొత్తులతో పూడ్చుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ కొత్త ప్లాన్ వేశారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే. రాజధాని నిర్మాణంలో ఏ మాత్రం పురోగతి లేకపోవటం చంద్రబాబు సర్కారుకు పెద్ద మైనస్ గా మారనుంది. దీనికి తోడు ఏపీలో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతి కూడా ఓ పెద్ద సమస్యగా మారనుంది. వీటన్నింటిని అధిగమించి మళ్ళీ గెలుపు తీరాలకు చేరాలంటే చంద్రబాబు అండ అందించే ‘చేయి’ అవసరం అయింది. మరి అంతిమ ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it