కెసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికార టీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు కెసీఆర్, కెటీఆర్ లపై పరుష వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రధానంగా కెసీఆర్, కెటీఆర్, హరీష్ రావులనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ మునిసిపల్, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో లక్షా ఏడు వేల ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఉడగొట్టాలని ప్రజలకు ఆయన పిలుపున్చిచ్చారు. సోమవారం నాడు రేవంత్ రెడ్డి సిరిసిల్ల కూటమి అభ్యర్థి మహేందర్ రెడ్డికి మద్దతుగా స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా ఎవరి దయాదాక్షణ్యాల వల్ల రాలేదని, ఇక్కడి ప్రజలే పోరాడి సాధించుకున్నారని పేర్కొన్నారు. సిరిసిల్లలో స్థానికుడే ఇక్కడి నాయకుడు కావాలి. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే అమెరికా వెళ్లే కేటీఆర్‌కు ఓటు వేస్తారా? ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే గిట్టే మహేందర్ రెడ్డికి ఓటు వేస్తారా?.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్, కేటీఆర్‌లు వారికి కావాల్సింది వారు అయ్యారు. కానీ తెలంగాణ సమస్యలు పరిష్కారం కాలేదు. 250 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లతో రెండు వందలకో చీర కొని బతుకమ్మ చీరలలో కమీషన్ నొక్కారు. వారానికోసారి చేనేత బట్టలు ధరించాలన్న కేటీఆర్ ధరిస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ ఓడిపోతే టీఆర్‌ఎస్‌ను గుంజుకోవడానికి మంత్రి హరీశ్ చూస్తుండు. కుటుంబ గొడవలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు ఎందుకు వేయాలో టీఆర్‌ఎస్ నేతలు చెప్పగలరా?. తెలంగాణ ప్రజల కష్టాలను చూసి సోనియా గాంధీ ఆవేదన చెందారు. 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించని అసమర్థ సర్కారు తీరుని చూసి సోనియా బాధపడ్డారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లకు పైగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.