Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..జగన్ ఫెయిల్..నేను కాను

చంద్రబాబు..జగన్ ఫెయిల్..నేను కాను
X

‘ప్ర‌స్తుతం రాష్ట్రంలో అధికార ప‌క్షం విఫ‌ల‌మైంది. ప్ర‌తిప‌క్ష నేత ఫెయిల్ అయ్యారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్రం ఫెయిల్ అవ్వ‌డు. నా తుదిశ్వాస వ‌ర‌కు నా అన్న‌ద‌మ్ములు, అక్క చెల్లెళ్లకు అండ‌గా ఉంటా. ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తినే ప‌రిస్థితి ఉంటే ఎవ‌ర్న‌యినా బ‌లంగా ఎద‌ర్కోగ‌ల‌ను. ’ అని వ్యాఖ్యానించారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. ‘ఫొటోలు తీయించుకునేందుకు నేను రాజ‌కీయాల్లోకి రాలేదు.. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు వ‌చ్చాను. ఓ వ్య‌క్తిపై ఇష్ట‌మంటే ఆయ‌న ఆశ‌యాలు పాటించాలిగానీ, ఫోటో ఇస్తేనే ఇష్ట‌మంటే ఎలా.?’ అని ప్రశ్నించారు. బుధ‌వారం కాకినాడ జి.కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు మాజీ శాస‌న స‌భ్యుల‌తో పాటు పెద్ద ఎత్తున మాజీ స‌ర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపిటీసీలు, వివిధ రంగాలకు చెందిన‌ ప్ర‌ముఖులు జ‌న‌సేన పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. “నాపై అపార‌మైన న‌మ్మ‌కంతో పార్టీలో చేరిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. అంద‌ర్నీ హృద‌య‌పూర్వ‌కంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. అంతా ఫోటోలు కావాలి, సెల్ఫీలు కావాలి అని అడుగుతున్నారు. మోడీ సృష్టించిన ఈ సెల్ఫీ క‌ల్చ‌ర్ ఎంత వ‌ర‌కు వెళ్లిందంటే… ఫోటోలు తీయించుకుంటేనే ఓ వ్య‌క్తి ఇష్ట‌మ‌నే వ‌ర‌కు వెళ్లింది.

నా వ‌ర‌కు నేను ఓ వ్య‌క్తిని ఇష్ట‌ప‌డితే అత‌ని ఆశ‌యాలు మాత్ర‌మే పాటిస్తా. నేను ఫొటోలు ఇస్తూ పోవాలంటే ఎంత మందికి ఇవ్వ‌గ‌ల‌ను. ల‌క్ష‌ల మంది జ‌న‌సైనికుల్లో ఎంత మందికి న్యాయం చేయ‌గ‌ల‌ను.? నా స‌మ‌యం అంతా ఫొటోలు తీయించుకోవ‌డానికే కేటాయిస్తే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి జ‌రిగిన అన్యాయంపై ఎక్క‌డ పోరాటం చేయ‌గ‌ల‌ను. నేను రాజ‌కీయాల్లోకి ఫొటోలు తీయించుకోవ‌డానికి రాలేదు. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు వ‌చ్చా. నేను మాత్రం ఎంత మందికి ఫొటోలు ఇవ్వ‌గ‌ల‌ను. ఈ ప‌రిస్థితి క‌ష్టంగా ఉంటుంది. నేను మీ వాడిని, మీ ఇంట్లో వాడిని, మీకు అండ‌గా ఉండే వాడిని. మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌రిస్తే మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మించండి. ద‌య‌చేసి న‌న్ను అర్థం చేసుకోండి. ఫొటోలు తీయించుకోక‌పోతే జ‌న‌సేన‌ని వ‌దిలేస్తాం.. ప‌వ‌న్‌తో ఉండం అని మాట్లాడితే నేను విఫ‌ల‌మైన‌ట్టే. ఫోటోల‌తో మార్పు వ‌స్తుందా.? పోరాటాల వ‌ల్ల మార్పు వ‌స్తుందా.? పోరాట‌మే టీడీపీని ఓడిస్తుంది. జ‌న‌సేన‌ని గెలిపిస్తుంది. మీ అంద‌రి పోరాట‌మే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ముఖ్య‌మంత్రిని చేస్తుంది. ఉన్న‌త ఆశ‌యాల‌తో వ‌చ్చా... ద‌య‌చేసి న‌న్ను సెల్ఫీల‌కి ప‌రిమితం చేయ‌కండి. ఈ రోజు నేను ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్నా. నాకు ముఖ్య‌మంత్రి అయ్యే అర్హ‌త ఉందా.? లేదా అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిలా న‌న్ను ముఖ్య‌మంత్రిని చేయ‌మ‌ని మాత్రం అడ‌గ‌ను. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఎవ‌రో చెబితేనో, అడిగితేనో వ‌చ్చేది కాదు. రాష్ట్రంలో ఇంత దోపిడి జ‌రుగుతుంటే, ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే నిల‌దీయాల్సిన ప్ర‌తిప‌క్ష నేత ఎక్కడ ఉన్నారు.

ముఖ్య‌మంత్రి రోజుకో మాట మాట్లాడతారు. కాసేపు బీజేపీతో దోస్తి అంటారు. ఇంకాసేప‌టికి వ‌ద్దంటారు. హోదా కావాలి అంటారు. వద్దంటారు. ఇదేమైనా ఊస‌ర‌వెల్లి సినిమానా.? ఇన్ని రంగులు మార్చే వ్య‌క్తి అవ‌స‌ర‌మా. మాట మార్చ‌ని నాయ‌కుడు దేశానికి కావాలి. మ‌డ‌మ‌ తిప్ప‌నివాడు దేశ రాజ‌కీయాల్లోకి రావాలి. హైద‌రాబాద్‌లో ఆంధ్రుల్ని దోపిడిదారులుగా చిత్రించారు. ఇవ‌న్నీ పాల‌కులు చేసిన పొర‌పాట్లు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడు లాంటి నాయ‌కులు రూపొందించిన విధానాల పొర‌పాటు. ఇలాంటి ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాల‌తో విసిగిపోయాం. ఓ కులం కోస‌మో, మ‌తం కోస‌మో చేసే రాజ‌కీయాలు వ‌ద్దు. ఒక‌సారి ఆంధ్ర-తెలంగాణ అంటూ తెలుగు ప్ర‌జ‌ల్ని విడ‌గొట్టారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆంధ్రుల్ని కులాల పేరుతో విడ‌గొడ‌తారా.? ఆంధ్రుల్ని తిడుతుంటే, త‌రిమేస్తుంటే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాట్లాడ‌రు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డానికి ఉన్న ధైర్యం..అప్పుడు ఏమైంది.? హైద‌రాబాద్‌లో ఉన్న ఆయన ఆస్తులుపోతాయ‌న్న భ‌యం. నాకు అలాంటి భ‌యాలు లేవు. ఒక్క‌సారి దెబ్బ తిన్న త‌ర్వాత పార్టీ పెట్టడానికి ఎంత ధైర్యం కావాలి. నాకు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి వ్య‌తిరేక‌త లేదు. అత‌ని మీద కేసులు ఉన్నాయి. కేసులు లేని వాడు ముఖ్య‌మంత్రి కావాలి. 2014లో చంద్ర‌బాబుకి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు నాకు తెలియ‌దా.. ఆయ‌న వెన్నుపోటుదారుడ‌ని. అయితే మ‌న‌కి గాంధీ, అంబేద్క‌ర్‌, ప‌టేల్ లాంటి నాయ‌కులు లేరు. ఉన్న‌ది ఇద్ద‌రే జ‌గ‌న్‌, చంద్ర‌బాబు. ఇద్ద‌రిలో ఎవ‌రు బెట‌ర్ అన్న ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు వైపే మొగ్గు చూపాల్సి వ‌చ్చింది. ’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it