అక్రమాలకు అడ్డాగా ఏపీ ఐఅండ్ పీఆర్ శాఖ
ఉనికిలో లేని సంస్థలకు 29 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు?!
ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు జోరుగా విన్పిస్తున్నాయి. ఇష్టారీతిన ప్రకటనల జారీ చేయటంతో పాటు..అసలు ఉనికిలోనే లేని సంస్థలకు కోట్లాది రూపాయల పనులు అప్పగించి దోపిడీ చేస్తున్నారనే ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఐఅండ్ పిఆర్ శాఖకు చెందిన కొంత మంది ఉన్నతాధికారులు ఏకంగా 29 కోట్ల రూపాయల పనులను ఎక్కడా లేని సంస్థలకు కేటాయించి కొట్టేసినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ఈ శాఖలో కోట్లాది రూపాయల పనుల కేటాయింపు అంతా కొంత మంది అధికారులు ఇష్టారాజ్యంగా సాగుతుందని చెబుతున్నారు. సహజంగా ఏదైనా ప్రతిపాదన వచ్చినప్పుడు ఫైల్ కింది సిబ్బంది నుంచి నడుస్తుంది.
కానీ ఏపీ ఐ అండ్ పీఆర్ శాఖలో అందుకు భిన్నంగా వర్క్ ఆర్డర్లు అన్నీ ఆ శాఖ కమిషనర్ నేరుగా ఇస్తున్నారని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం అయితే ముసాయిదా ప్రతిపాదనపై కమిషనర్ సంతకం చేస్తారు. ఆ శాఖకు చెందిన అధికారులు కమిషనర్ ఆదేశాల మేరకు వర్క్ ఆర్డర్లు జారీ చేస్తారు. కానీ ఈ నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా కోట్లాది రూపాయల పనులను నేరుగా కమిషనర్ తన ఇష్టానుసారం కేటాయిస్తున్నారని..ఇందులో భారీ ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు చేరినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మీ సేవ రశీదుల ముద్రణకు సంబంధించిన దాంట్లోనూ కోట్లాది రూపాయల స్కామ్ జరిగినట్లు సమాచారం. ఆ వివరాలు త్వరలోనే బహిర్గతం కానున్నాయి.