Telugu Gateway
Telangana

ప్రగతి భవన్ లో రాజకీయాలా?

ప్రగతి భవన్ లో రాజకీయాలా?
X

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో రాజకీయాలు చేస్తారా?. అక్కడ అసలు కెటీఆర్ కు ఏమి పని?. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ప్రగతి భవన్ లో కెటీఆర్ తో సమావేశం అయినట్లు బహిరంగంగా చెప్పారని..అక్కడ రాజకీయ సమావేశాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. విశ్వేశ్వర్ రెడ్డిని ఏయే అంశాలపై బెదిరించారు?. అపోలో ఆస్పత్రికి ఇచ్చిన భూమిలో మిగులు ఉన్న ప్రాంతాన్ని లాక్కుంటామని బెదిరించారా? లేక పెండింగ్ బిల్లు ఇవ్వబోమని చెప్పారా? ప్రగతి భవన్ లో ఏమి జరిగిందో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ లోకి వస్తారని తాను చెప్పానే కానీ..విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్ ల పేర్లు తాను చెప్పలేదన్నారు. ఇద్దరు ఎంపీలు అన్నప్పుడు వినోద్, కవితలను ఎందుకు అనుమానించటం లేదని వ్యాఖ్యానించారు.

వీళ్ళిద్దరూ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని..తనని ఎందుకు తిడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విశ్వేశ్వర్ రెడ్డి తాండూరులో మహేందర్ రెడ్డికి అనుకూలంగా ఎందుకు ప్రచారం చేయటంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కెసీఆర్ నామినేషన్ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగి విజయ్ కుమార్ పాల్గొన్నారని..ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఇది నిబంధనలను ఉల్లంఘించటం కాదా? అన్నారు. ఈ అంశంపై సీఈవోకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల తీరుపై కూడా ఆయన ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే రేవంత్ రెడ్డి తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్ లు ఖండించారు. తాము పార్టీ మారటంలేదని తెలిపారు.

Next Story
Share it