కొత్త వివాదంలో హీరో విశాల్
విశాల్ కు..వివాదాలకు ఏదో దగ్గర సంబంధం ఉన్నట్లు ఉంది. నిత్యం ఆయన ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. తాజాగా ఓ సినిమాకు సంబంధించి ఆయన ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ఈ వివాదానికి కారణం అవటం విశేషం. పోలీసు జీప్ పై విశాల్ ఓ బీరు బాటిల్ పట్టుకుని కూర్చుంటాడు. ఈ స్టిల్ కారణంగా ఆయన ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమాను తమిళ్ లో విశాల్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. టెంపర్ చిత్రాన్ని విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉండటమే కాకుండా సమాజానికి మంచి చెప్పే హీరో ఇటువంటి సన్నివేశాల్లో నటించటం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
ప్రధానంగా మద్యపానంపై పోరాడుతున్న పిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు రాందాస్ విశాల్ పై విరుచుకు పడ్డారు. గతంలో సినిమాల్లో తారలు పొగతాగటంపై రాద్దాంతం చేసి ఓ మేరకు విజయం సాధించారు రాందాస్. ఇప్పుడు మద్యం విషయంలో విశాల్‌పై మండిపడుతున్నారు. అయితే ఈ వివాదం ఎక్కడికి వెళుతుందోనని తమిళ చిత్రసీమ ఆందోళనలో ఉంది. తమిళనాట సినిమాల్లో సిగరెట్ తాగటంపై రాజకీయ నేతల విమర్శలకు ఏకంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ వంటి హీరోలే తమ సినిమాల్లో అలాంటి సన్నివేశాలను తొలగించటంతో పాటు ఇకపై తమ సినిమాల్లో అటువంటివి ఉండబోవని ప్రకటించి ఆచరిస్తున్నారు. మరి విశాల్ ఈ దుమారంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.