దేశ దిమ్మరిలా చంద్రబాబు
ఏపీలో రాజకీయం రోజరోజుకు మరింత ముదురుతోంది. బిజెపి, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఒకరినొకరు పరుష పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు..బిజెపి నేతలూ ఇద్దరు అభ్యంతరకర భాష వాడుతూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే..ఎన్నికల సమయం దగ్గరపడే నాటికి ఇది మరెక్కడికి వెళుతుందో అన్న టెన్షన్ సామాన్యుల్లో నెలకొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దొంగ పోరాటాలు చేస్తూ రాజకీయ వ్యాపారాలకు ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై బీజేపీ నేతలతో కలసి జీవీఎల్ నరసింహా రావు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు తమ పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాల వ్యాపారం చేసి చాలా సంపాదించారని, ఆ డబ్బుతో వ్యాపారం చేస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన చంద్రబాబు నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని, ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. అప్పు తెచ్చిన డబ్బును చంద్రబాబు రాజకీయ వ్యాపారం కోసం వాడుతున్నారని విమర్శించారు. ప్రజాధనంతో చంద్రబాబు దేశ దిమ్మరిగా తిరుగుతున్నారని అన్నారు. ఓడిపోయే పార్టీల నాయకులందరినీ చంద్రబాబు కలుస్తున్నారని ఎద్దేవా చేశారు.