చంద్రబాబును శనిలా నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం నాడు కూడా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును శనిలా నెత్తిన పెట్టుకుందని విమర్శించారు. తెలంగాణలో ఇంకా చంద్రబాబు పెత్తనం కావాలా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ముఖ్యం కాదని, ప్రజల అభీష్టం గెలవాలని కేసీఆర్ అన్నారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్-టీడీపీ ఒకవైపు.. నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒకవైపు ఉన్నాయని, ఈ రెండింటి మధ్యే అసలైన పోటీ ఉందన్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని ప్రజలను కేసీఆర్ కోరారు. జనాలు లేక నారాయణ ఖేడ్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సభ వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పెత్తనం పోవాలంటే అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాదని, అన్ని ఎంపీ సీట్లలలోనూ టీఆర్ఎస్ గెలిపించాలని పిలుపునిచ్చారు.
కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యం అన్నారు.తెలంగాణాకు కేటాయించిన నీళ్లకు సరిపడా ప్రాజెక్టులు లేవని..తెలంగాణ ఏర్పడిన తర్వాతే దీనిపై పూర్తి కసరత్తు మొదలైందని చెప్పారు. ఈ అంశంపై చర్చిద్దామంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి పారిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం తెలివిలేదన్నారు. రకరకాల గాంధీలు ఇప్పుడు తెలంగాణకు వచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని..వాళ్లు అవినీతిపరులు కాబట్టి అందరూ అలాగే ఉంటారని భావిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ వచ్చాక అవినీతిని అరికట్టిందని అన్నారు. ఈ దద్దమ్మలు అంతా అప్పులు పెంచామని విమర్శలు చేస్తున్నారని..మనకన్నా 14 రాష్ట్రాలకు ఎక్కు వ అప్పులు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ తానే కట్టానని చెప్పుకునే చంద్రబాబు చార్మినార్ కూడా కట్టాడా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావచ్చిందని..జూన్ నుంచి నీళ్లు వస్తాయని తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.