Telugu Gateway
Andhra Pradesh

తెలుగుదేశం ఎంపీకి ఈడీ షాక్

తెలుగుదేశం ఎంపీకి ఈడీ షాక్
X

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి మరో సారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారుల షాక్ తగిలింది. చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఈడీ అధికారులు శుక్రవారం నాడు దాడులు జరిపారు. నాగార్జున హిల్స్‌ లో ఉన్నబెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీలో అధికారులు సోదాలు చేశారు. గత అక్టోబర్‌లోనూ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సుజనాచౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్‌ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలు వచ్చాయి. గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ట్రేడింగ్ లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బును మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే... కేవలం రసీదుల రూపంలో డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై 2016ఫిబ్రవరిలోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. గత అక్టోబర్‌లో ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున హార్డ్‌ డిస్క్‌ లు, ఫైల్స్‌ తో పాటు కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకుంది. దాదాపు మూడు బ్యాంకుల నుంచి 304కోట్ల రూపాయలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

ఆంధ్రాబ్యాంకు నుంచి 60కోట్లు, కార్పోరేషన్‌ బ్యాంకు 120, సెంట్రల్‌బ్యాంకు 124కోట్లు అప్పుగా తీసుకున్నారు. చాలావరకు నిధులను డొల్ల కంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల ఫొరెన్సిక్ ఆడిటింగ్‌లోనూ ఈ విషయం తేటతెల్లమైనట్లు తెలుస్తోంది. తాజా సోదాల్లోనూ ఈడీ పలు కీలక ఆధారాలు సేకరించింది. ముఖ్యంగా ఈ మెయిల్స్ ద్వారా జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను వీరు పరిశీలించినట్ల సమాచారం. ఇదిలా ఉంటే టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. కవరేజ్ కు వెళ్ళిన మీడియా బృందంపై సెక్యూరిటీ బృందం దురుసుగా వ్యవహరించింది. తన ఇంటి ముందు కెమెరాలతో షూట్ చేయవద్దని సుజనా చౌదరి రిపోర్టర్లను బెదిరించారు. ఈడీ రైడ్స్ పై మాత్రం సుజనా చౌదరి స్పందించలేదు.

Next Story
Share it