Telugu Gateway
Politics

తెలంగాణలో చక్రం తిప్పుతున్న డీ కె శివకుమార్ !

తెలంగాణలో చక్రం తిప్పుతున్న డీ కె శివకుమార్ !
X

డీ.కె. శివకుమార్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాగా వెలుగులోకి వచ్చిన పేరు ఇది. కర్ణాటకలో బిజెపి అధికారంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవటంలో విజయవంతం అయిన నేత ఈ శివకుమార్. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓ మంచి వ్యూహాకర్తగా పేరుగాంచిన శివకుమార్ తెలంగాణ ఎన్నికలపై కూడా ‘ఫోకస్’ పెట్టారు. ఆయన ఇప్పుడు హైదరాబాద్ లోనే మకాం వేసి కాంగ్రెస్ అభ్యర్దుల గెలుపునకు తన వంతు కృషి చేస్తున్నారు. పలు నియోజకవర్గాలకు చెందిన సమాచారం మొత్తం దగ్గర పెట్టుకుని గెలుపు వ్యూహాలను రచించటంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు సహకరిస్తున్నారు. దీని కోసం శివకుమార్ తరపున ఓ టీమ్ పనిచేస్తుంది. సామాజిక సమీకరణలు మొదలుకుని పలు అంశాలపై ఆయన దగ్గర వివరాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అభ్యర్దులకు శివకుమార్ తన వ్యూహాలను తెలుపుతూ గైడ్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలుపు దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. అందుకే తెలంగాణ ఎన్నికల బాధ్యతను డీ కె శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. అప్పగించిన పనిని సక్సెస్ చేయటంలో శివకుమార్ దిట్ట. అందుకే ఆయన్ను తెలంగాణలో దింపింది కాంగ్రెస్ పార్టీ.

శివకుమార్ ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎలాగైనా రాజ్యసభకు ఎన్నిక కాకుండా గుజరాత్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వప్రయత్నాలు చేశారు. అమిత్ షా ప్రయత్నాలను బ్రేక్ చేసి...అహ్మాద్ పటేల్ గెలుపులో కూడా శివకుమార్ తన వ్యూహాన్ని అమలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ రావటంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి చేయని ప్రయత్నం లేదు. ఈ ప్రయత్నాలు అన్నింటిని ఫెయిల్ చేసి...జెడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కూడా శివకుమార్ దే కీలక పాత్ర. ఈ విషయాలన్నీ గ్రహించే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణలో డీ కె శివకుమార్ సేవలను వాడుకోవాలని నిర్ణయించింది. మరి డీ కె శివకుమార్ ఇక్కడ ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it