Telugu Gateway
Politics

సీఎం ప్రజలను కలవాల్సిన పనిలేదు

సీఎం ప్రజలను కలవాల్సిన పనిలేదు
X

చిన్న చిన్న సమస్యలకు సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం లేదని తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం ప్రజా దర్భార్ నిర్వహించటం అంటే రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలినట్లే అన్నారు. రేషన్ కార్డులివ్వడం ,మోరీ లు శుభ్రం చేయడం కూడా సీఎం చేయాలంటే ఎలా ?. ప్రగతి భవన్ కే కెసిఆర్ పరిమితమయ్యారని కొందరు సొల్లు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే సీఎం పని అని వెల్లడించారు. కెటీఆర్ గురువారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్ లో కెటీఆర్ దగ్గర నుంచి అప్పుతీసుకున్నట్లు ప్రస్తావించిన అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదొక వార్తా..దాన్ని పబ్లిష్ చేయటం..మళ్ళీ మీరు దాన్ని అడగటం అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో తండ్రీ..కొడుకుల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండవా..కొడుకుకు పాకెట్ మనీ ఇవ్వరా? అంటూ ప్రశ్న అడిగిన విలేకరిని ప్రశ్నించారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని..ఇప్పుడున్న మంత్రి పదవే తనకు చాలా ఎక్కువ అనే భావనతో ఉన్నట్లు తెలిపారు.

అసెంబ్లీ రద్దు చేసుకునే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి ఉందని..తమ నిర్ణయం సరైనదో కాదో ప్రజలు నిర్ణయిస్తారని ..ఆ సంగతి డిసెంబర్ 11న తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో తమకు పాలన చేతకాదని అన్నారని..ఇప్పుడు తాము అందరూ తలెత్తుకునేలా పాలన చేశామని కెటీఆర్ తెలిపారు. ఉద్యమకారులు మంచి పాలన చేయలేరన్నది తన అభిప్రాయం అని ..కానీ కెసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మంచి పాలన అందించారని తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన బిజెపికి చెందిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారని కెటీఆర్ గుర్తుచేశారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న పాలనను పోల్చిచూసుకుని తమకు ఓటు వేయాలని అడుగుతున్నట్లు వెల్లడించారు. ‘వ్యవసాయరంగ సంక్షోభానికి తెర దించేందుకు రైతు బంధు ,రైతు బీమా పథకాలు తెచ్చాం. రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల స్వయంగా పార్లమెంటు లో చెప్పారు. నేత రంగం లో కష్టాలను తగ్గించాం. ఆర్ధిక అభివృద్ధి తో పాటు 16 అంశాల్లోదేశం లో ప్రథమ స్థానం లో ఉన్నాం. పాలనా వికేంద్రీకరణ కోసం జిల్లాలు ,రెవెన్యూ డివిజన్లు ,మండలాల సంఖ్య పెంచుకున్నాం. తండాలు ,గూడేలను గ్రామ పంచాయతి లుగా మార్చాం. అభివృద్ధి ,సంక్షేమం ,పాలన సంస్కరణ లతో తెలంగాణ ను అగ్రబాగాన నిలిపాం. శాంతి భద్రతలు అదుపులో పెట్టాం .హైదరాబాద్ లో ఒక్క నిమిషం కర్ఫ్యూ లేదు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు మూడంచెల విధానాన్ని అమలు చేశాం.

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ,స్వయం ఉపాధి ,ప్రైవేటు రంగం లో ఉపాధి.. ఇలా మూడంచెల తో ముందుకు పోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసినా నిరుద్యోగ సమస్య తీరదు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేశాం. ప్రగతి చక్రాలు ఆగకూడదంటే టీఆర్ఎస్ కే ఓటెయ్యాలి. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో డిసెంబర్ 7 న ప్రజలు తీర్పు ఇస్తారు ..అప్పటి దాకా వేచి చూద్దాం. చంద్రబాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడు. ఇప్పటి దాకా చంద్రబాబు వేరే పార్టీ లతో పొత్తు లేకుండా ఎన్నికలకు పోలేదు. ఆయన పొత్తు పెట్టుకుని పార్టీ ఒక్క వైసీపీ ఒక్కటే. భవిష్యత్ లో బాబు వైసీపీ తో కూడా పొత్తు పెట్టుకుంటారు. బాబు రాహుల్ ప్రచారం చేయనివ్వండి -మా ప్రచారం మేము చేస్తాం. ప్రజలే ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకుంటారు.’ అని వ్యాఖ్యానించారు. నిజంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అంత దమ్ము, ధైర్యం అంటే తెలంగాణలో 119 సీట్లకు ఎందుకు పోటీచేయటం లేదని ప్రశ్నించారు.

Next Story
Share it