చంద్రబాబు నోట జై తెలంగాణ మాట

ఎన్నికల చిత్రాలు అంటే ఇవే. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జై తెలంగాణ అని నినదించారు. ఆయన అనటమే కాదు..ఖమ్మం సభకు హాజరైన ప్రజలను కూడా జై జై తెలంగాణ అనాల్సిందిగా కోరారు. బుధవారం నాడు చంద్రబాబు ఖమ్మంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలసి వేదిక పంచుకున్నారు. పొత్తు ఖరారు అయిన తర్వాత ఎన్నికల సభలో ఇలా వేదిక పంచుకోవటం ఇదే మొదటిసారి. అదే సమయంలో తెలంగాణ ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నట్లు టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపైనా చంద్రబాబు స్పందించారు. దిగువ రాష్ట్రం అయిన ఏపీ ప్రాజెక్టులను ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ అబివృద్దికి అడ్డుపడనని, సహకరిస్తానని అన్నారు. కాంగ్రెస్ తో కలయిక చారిత్రక అవసరం అని ఆయన అన్నారు. ప్రదాని మోడీ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, అందుకే దేశాన్ని రక్షించడానికి కాంగ్రెస్ తో కలిశామని ఆయన అన్నారు.37 సంవత్సరాలు కాంగ్రెస్ తో పోరాడినా,ఇప్పుడు ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
తెలంగాణలో కెసిఆర్ అబివృద్ది చేయడం లేదని, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన అన్నారు.కాంగ్రెస్ తో కలవడం ఒక నూతన చరిత్ర అని ఆయన చెప్పారు.ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, ముస్లింల పట్ల అసహనం పెరుగుతోందని,సిబిఐ,ఐటి, ఈడి దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.సైబరాబాద్ కు తానే రూపకల్పన చేశానని ఆయన చెప్పారు. కెసిఆర్ తనను ఎందుకు తిడుతున్నారో తెలియడం లేదని చంద్రబాబు అన్నారు. ప్రజా కూటమి అభ్యర్దులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు, జీఎస్‌టీని సరిగ్గా అమలు చేయలేదని దీని వల్ల రూపాయి విలువ కూడా పడిపోయిందన్నారు. బీజేపీ దేశం కోసం కాకుండా స్వార్థం కోసం పనిచేస్తుంన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులు చేయిస్తున్నారన్నారు. ఖమ్మంలోని 10 స్థానాలలో కూడా ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుజాతి ఐక్యత, సాధికారత కోసం టీడీపీ స్థాపితం అయిందని, విభజన జరిగినా తెలుగుజాతి కలిసే ఉండాలని తాను చెప్తూ వస్తున్నానన్నారు. విభజన చట్టంలోని హామీల గురించి మోడీని కెసీఆర్ ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు.