Top
Telugu Gateway

కెటీఆర్ ప్ర‌య‌త్నాలు ఫెయిల్..టీఆర్ఎస్ కు బిగ్ షాక్

కెటీఆర్ ప్ర‌య‌త్నాలు ఫెయిల్..టీఆర్ఎస్ కు బిగ్ షాక్
X

ఎన్నిక‌ల ముంగిట టీఆర్ఎస్ కు బిగ్ షాక్. టీఆర్ఎస్ పార్టీకి..ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి రాజీనామా చేశారు. అన్ని పార్టీలు ప్ర‌చార జోష్ లో ఉన్న త‌రుణంలో జ‌రిగిన ఈ ప‌రిణామం టీఆర్ఎస్ కు షాక్ లాంటిదే. కొద్ది రోజుల క్రిత‌మే కొండా పార్టీ మారుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగినా ఆయ‌న ఆ వార్త‌ల‌ను ఖండించారు. మంత్రి కెటీఆర్ ఆక‌స్మికంగా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. అప్ప‌టికి ఆయ‌న మెత్త‌బ‌డినా మంగ‌ళ‌వారం నాడు రాజీనామా చేస్తూ నిర్ణ‌యం తీస‌కున్నారు. దీంతో కెటీఆర్ బుజ్జ‌గింపులు ఫెయిల్ అయిన‌ట్లు అయింది. గ‌త కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ సభ్యత్వంతో పాటు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌కు రాజీనామా లేఖను పంపారు. అంతేకాదు ఈనెల 23న సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే త‌మ పార్టీలోకి ఇద్ద‌రు ఎంపీలు వ‌స్తారు..చేత‌నైతే ఆపుకోండి అంటూ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే ఒక పెద్ద వికెట్ ప‌డింది.

ఇప్పుడు మ‌రో వికెట్ ఎవ‌రు అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. త‌న రాజీనామాకు కార‌ణాలు వివ‌రిస్తూ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆపద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు మూడు పేజీల లేఖ రాశారు. ఐదు కారణాలతో కూడిన మూడు పేజీల లేఖను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు విశ్వేశ్వర్‌రెడ్డి పంపించారు. తెలంగాణ వ్యతిరేకులకు కేబినెట్‌లో చోటు కల్పించడం, పార్టీలో తలెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు తాను చేసిన ప్రయత్నాలను నీరుగార్చడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, రెండేళ్లుగా పార్టీ ప్రజలకు దూరమవడం వంటి కారణాల వల్ల టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చాలా కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతపై ఆయనకు అభ్యంతరాలున్నాయి. తనకు కాకుండా మహేందర్‌రెడ్డికి పార్టీ పెద్దపీట వేస్తుందనే ఆలోచనలో విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.

Next Story
Share it