టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ నేతలే సిగ్గుపడుతున్నారా?
విచిత్రం. టీడీపీతో కాంగ్రెస్ పొత్తుకు ఆ పార్టీ నేతలు సిగ్గుపడుతున్నారా?. చూస్తుంటే అలాగే ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ జరిగిన రోజే మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మాజీ ఎంపీ, సీనియర్ నేత సి. రామచంద్రయ్య కూడా పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. అయినా కూడా ఇప్పటివరకూ పార్టీలో కొనసాగిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీతో పొత్తుకు రెడీ కావటంతో ఆ పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎగరేయటం విశేషం. అసలు టీడీపీలో రావాల్సిన తిరుగుబాటు విచిత్రంగా కాంగ్రెస్ పార్టీలో వస్తుందని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుకు క్యాడర్ లో 70 శాతంపైగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు చెప్పటం చూసి అవాక్కు అవుతున్నారు.
ఇలా సంతృప్తి చెందిన వారిలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటా అని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే జనం బట్టలూడదీసి తంతారన్న మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అమోదం ఉందా? అని నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీలో ప్రస్తుతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని..అది ఎప్పుడైనా పేలిపోవచ్చని ఓ నేత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రామచంద్రయ్య..ఇప్పటికిప్పుడు చంద్రబాబు నిజాయతీపరుడు అని ఎలా చెప్పగలం అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షం అని విమర్శించారు.