Telugu Gateway
Politics

ఎంఐఎం ముందు కెసీఆర్ అయినా తలవంచాల్సిందే

ఎంఐఎం ముందు కెసీఆర్ అయినా తలవంచాల్సిందే
X

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలు అధికారికంగా పొత్తు లేకపోయినా బహిరంగంగానే ఒకరికొకరు సమర్థించుకుంటున్నారు. ఎంఐఎం అదినేత, ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా నిర్మల్ వెళ్లి మరీ అక్కడ టీఆర్ఎస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని ప్రకటించారు. అయితే ఎంఐఎంకు చెందిన మరో సీనియర్ నేత అక్భరుద్ధీన్ ఓవైసీ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ తో సహా ఎవరైనా తమ ముందు తలవంచాల్సిందేనని, తమకు గొడుగు పట్టాల్సిందే అని వ్యాఖ్యానించారు. కెసీఆర్ తోపాటు ఉమ్మడి రాష్ట్ర సీఎంలు అయిన చంద్రబాబు, వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. తాము తలచుకుంటే ఎవరినైనా సీఎం పీఠంపై కూర్చోబెడుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్ 11 తర్వాత తమ సత్తా ఏమిటో చూపుతామని చెప్పారు. గతంలో ఓ సారి కూడా అక్బరుద్దీన్ కర్ణాటకలో అతి తక్కవ సీట్లు వచ్చిన కుమారస్వామి ముఖ్యమంత్రి కాలేదా?. తెలంగాణలో ఎంఐఎం కూడా సీఎం సీటు కోసం ప్రయత్నిస్తుందని అంటూ కలకలం రేపారు. అయితే అక్భరుద్దీన్ వ్యాఖ్యలతో షాక్ కు గురైన టీఆర్ఎస్ వెంటనే రంగంలోకి దిగి అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడి అక్భర్ మాటలకు ఖండన ఇప్పించే ప్రయత్నం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా తన నిర్ణయమే ఫైనల్ అని అసదుద్దీన్ అప్పట్లో తన తమ్ముడి వ్యాఖ్యల తీవ్రత తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి అక్భరుద్దీన్ కెసీఆర్ మొదలుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంలపైనా వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it