చంద్రబాబు..లోకేష్ ల ‘యువనేస్తం’ అట్టర్ ఫ్లాపా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ల ‘విదేశీ పర్యటనలు’ ఫలించాయి. ఏపీకి వేల సంఖ్యలో కంపెనీలు వచ్చాయి. అవి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఇఛ్చేశాయి. ఇప్పుడు ఏపీ ఒక్క మాటలో చెప్పాలంటే ‘నిరుద్యోగరహిత’ రాష్ట్రంగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు, నారా లోకేష్ ల మానన పుత్రిక స్కీమ్ ‘యువనేస్తం’ కింద నిరుద్యోగ భృతికి కేవలం రెండు లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారట. వాస్తవంగా ఏపీలో నిరుద్యోగుల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు కోటి వరకూ ఉంటుంది. అయితే నిరుద్యోగ భృతికి ప్రభుత్వం వేసిన అంచనానే పది నుంచి పన్నెండు లక్షల మంది అని. నిరుద్యోగ భృతికి ఇఫ్పటివరకూ అందిన దరఖాస్తులు కేవలం రెండు లక్షలే. అక్టోబర్ 2న ఈ స్కీమ్ ప్రారంభం కానుంది. అంటే ప్రభుత్వం ఇఛ్చే వెయ్యి రూపాయలు తీసుకోవటానికి యువత ఆసక్తి చూపటం లేదా?. లేక అసలు ఏపీలో నిరుద్యోగులుగా మిగిలి ఉన్నది కేవలం ఆ రెండు లక్షల మందేనా?. నిరుద్యోగ భృతి కింద వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించి..ఆ వెయ్యిని కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోమని ఈ మధ్య నారా లోకేష్ యువతకు సలహాలు ఇఛ్చారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రభుత్వ అంచనా ప్రకారమే నిరుద్యోగ భృతికి అర్హులైన వారి సంఖ్య పది లక్షల వరకూ ఉంటే..కేవలం రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకోవటం వెనక ఏమి జరిగింది. దరఖాస్తుల అప్ లోడ్ కాకుండా సిస్టమ్ లో ఇబ్బందులు సృష్టించారా?. లేక ప్రభుత్వం మీద నమ్మకం లేక చాలా మంది యువతే దీన్ని వదిలేశారా?.
తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నెల నెలా 2000 రూపాయల భృతి ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ నాలుగున్నర సంవత్సరాలు ఈ హామీని మర్చిపోయి ఇఫ్పుడు తెరపైకి తెచ్చారు. మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు రానున్నాయి. అందుకే ఈ హంగామా. అయితే చంద్రబాబు ఇఛ్చిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు పర్చిన దాఖలాలు లేవు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణాలు..ఇప్పుడు నిరుద్యోగ భృతి. అన్నీ అరకొరగానే. నిరుద్యోగ భృతి కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూస్తుంటే నిరుద్యోగ యువత ప్రభుత్వ సాయాన్ని కూడా నిరాకరిస్తున్నట్లే కన్పిస్తోంది. ఇది దేనికి సంకేతం?. ఇది తెలుగుదేశం పార్టీకి మోగుతున్న ప్రమాద ఘంటికలకు సంబంధించిన సంకేతం అని ఓ నాయకుడు విశ్లేషించారు.