Telugu Gateway
Andhra Pradesh

‘తిత్లీ’ విషయంలో జగన్ సెల్ప్ గోల్!

‘తిత్లీ’ విషయంలో జగన్ సెల్ప్ గోల్!
X

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన ‘తిత్లీ’ తుఫాన్ విషయంలో సర్కారు ఫెయిల్యూర్స్ స్పష్టంగా కన్పిస్తున్నాయి. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ‘అప్రమత్తత’ విషయంలో చేయాల్సినంత చేయలేకపోయమని అంగీకరించారు. పనిలో పనిగా ప్రతిపక్షాలపై రాళ్లు వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి ఓ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ప్రతిపక్ష నేత గా బాధితులు అందరికీ పూర్తి న్యాయం చేయాలని కోరటంలో ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ ఉండదు. కానీ అందుకు భిన్నంగా తిత్లీ నష్టాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అనే డిమాండ్ చేయటం వెనక జగన్ ఉద్దేశం ఏంటి?. కేంద్రం రాష్ట్రానికి అసలు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?. ఇస్తామన్నా వద్దంటారా?. ఎవరు భరిస్తే అసలు జగన్ కు ఎందుకు?. బాధితులను ఆదుకోవాలని కోరితే సరిపోయేదానికి..ఈ వ్యాఖ్యలు ఎందుకు? అంటూ ఓ వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు.

అది తుఫాన్ నష్టం అయినా..కరవు..సాగునీటి ప్రాజెక్టులు అయినా ‘అంచనాలు’ పెంచటంలో చంద్రబాబు దిట్ట. హుద్ హుద్ నష్ట అంచనాల సమయంలోనూ కేంద్రం ఏపీ సర్కారు పంపిన లెక్కలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు శ్రీకాకుళం తిత్లీ విషయంలోనూ అదే జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం సాయం చేస్తుంది. చేయాలి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా నష్టం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వ్యాఖ్యానించటం ద్వారా పార్టీని ఇరకాటంలోకి నెట్టారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సహాయ చర్యల్లో విఫలమైన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సిన జగన్..తన వ్యాఖ్యలతో తానే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారనే పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ వ్యాఖ్యలతో పార్టీ తరపున ప్రకటించిన కోటి రూపాయల సాయం వ్యవహారం కూడా మరుగున పడిపోయే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

Next Story
Share it