Telugu Gateway
Andhra Pradesh

ఈ సాన సతీష్ బాబు ఎవరో తెలుసా?!

ఈ సాన సతీష్ బాబు ఎవరో తెలుసా?!
X

సాన సతీష్ బాబు. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఎందుకు అంటారా?. దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో తలెత్తిన అంతర్గత పోరు..ఏకంగా సీబీఐ స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానాపై నమోదు అయిన కేసులో ‘సాన సతీష్ బాబు’ పేరు పెద్ద సంచలనంగా మారింది. వైఎస్ హయాంలో ఏపీలో సంచలనం సృష్టించిన వాన్ పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో కూడా ఈ సతీష్ బాబు సాన చాలా కీలకంగా వ్యవహరించారు. నిమ్మగడ్డ ప్రసాద్ కు సన్నిహితంగా ఉండేవారు. అప్పటి సీఎం వైఎస్, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద జరిగే సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. వాన్ పిక్ ప్రాజెక్టులో కూడా సాన సతీష్ బాబుకు కొంత వాటా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రెండు ఓడరేవులు, భారీ పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏకంగా 28 వేల ఎకరాలను వాన్ పిక్ కు అప్పగించటానికి రెడీ అవటంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు కావటంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది.

అయినా వాన్ పిక్ ప్రాజెక్టులో చాలా వరకూ భూమి నిమ్మగడ్డ ప్రసాద్ సారధ్యంలోని సంస్థల చేతిలోకి వెళ్లింది. ప్రస్తుతం సతీష్ బాబు సాన మ్యాట్రిక్స్ న్యాచురల్ రిసోర్సస్ ప్రైవేటె లిమిటెడ్ తోపాటు..పలు కంపెనీల్లో డైరక్టర్ గా ఉన్నారు. ఇందులో నిమ్మగడ్డ ప్రకాష్ కూడా మరో డైరక్టర్. మాంసం ఎగుమతిదారు మొయిన్ కురేషీ కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సాన సతీష్ బాబు పేరు తప్పించేందుకు సీబీఐ ప్రత్యేక డైరక్టర్ లంచం డిమాండ్ చేశారనేది అభియోగం. దేశంలో ఎంత పెద్ద ఆర్థిక నేరాల కేసులు నమోదు అయినా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల పేర్లు రావటం అనేది సహజంగా మారిపోయిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మ్యాట్రిక్స్ న్యాచురల్ తో కలుపుకుంటే మొత్తం ఏడు కంపెనీల్లో సతీష్ బాబు సాన డైరక్టర్ గా ఉన్నారు.

Next Story
Share it