Telugu Gateway
Telangana

టెన్షన్ లో టీఆర్ఎస్!

టెన్షన్ లో టీఆర్ఎస్!
X

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో టెన్షన్ పెరుగుతుందా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. పాజిటివ్ ఓటు దక్కే అవకాశం లేకపోవటంతో ఇప్పుడు ప్రత్యర్దులపై ప్రతికూల ప్రచారం ద్వారానే మరోసారి సెంటిమెంట్లను రాజేసి గెలవాలనే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు కన్పిస్తోంది. అందుకు ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలే నిదర్శనం. 119 స్థానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 సీట్లలో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ మహాకూటమి అధికారంలోకి వస్తే హోం, నీటిపారుదల శాఖ అడుగుతుందని హరీష్ రావు ప్రకటించటం వెనక ఇదే కోణం కన్పిస్తోంది. అసలు ఇంత వరకూ టీడీపీకి ఇచ్చే సీట్ల సంఖ్య ఎంతో కూడా తేలలేదు. కానీ టీడీపీ హోం, నీటిపారుదల శాఖలు కోరుతుంది అని ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే టీడీపీ ఆ పోస్టులు అడుగుతున్నది అని చెప్పటం ద్వారా టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా కూటమికే ఛాన్స్ ఉందనే సంకేతాలు పంపదల్చుకున్నారా?.

మరో మంత్రి కెటీఆర్ దీ అదే వరస. అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రోజూ ప్రతిపక్షాలు చెప్పిన మాటలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. కొత్త సచివాలయం ఎందుకంటే...ప్రజలు మాకు తీర్పిచ్చారు మా ఇష్టం అని సీఎం కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు అనుక్షణం పాలనకు అడ్డుపడటం వల్లే ముందస్తుకు వెళుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి శాఖలో అవినీతిపై తీవ్ర విమర్శలు వచ్చినా సర్కారు ఏకపక్ష పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో సమాధానం ఇచ్చిందే కానీ..అదే అవకాశం విపక్షాలు కోరితే నో ఛాన్స్ అని తేల్చేసింది. ప్రతి అంశంలోనూ ప్రతిపక్షాలను బుల్డోజ్ చేసిన టీఆర్ఎస్ నేతలు ఇఫ్పుడు ఎన్నికలకు ప్రతిపక్షాలే కారణం అన్నట్లు వ్యాఖ్యానించటం చూస్తుంటే ఆ పార్టీ నేతల్లో టెన్షన్ ఉన్నట్లు కన్పిస్తోందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. నిత్యం వంద సీట్ల జపం చేశారు కానీ..వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందని టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు అధికార పార్టీ నుంచి సాగుతున్న వలసలు కూడా ఆ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.

Next Story
Share it