తెలంగాణ ఎన్నికలపై కొత్త ట్విస్ట్

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కొత్త ట్విస్ట్. ఎన్నికలపై స్టే ఇచ్చే అధికారం హైకోర్టుకు ఉందంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ ముందస్తు ఎన్నికలు..ఓటర్ల జాబితాలో అక్రమాలు..అవకతకవలకు సంబంధించిన అంశాలపై శుక్రవారం నాడే విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో శుక్రవారం ఎలాంటి తీర్పు వెలువడనుందా? అన్న టెన్షన్ రాజకీయ పార్టీల్లో నెలకొంది. ఓటర్ల జాబితాలోని అక్రమాలకు సంబంధించి పిటిషన్‌లోని మెరిట్ ఆధారంగా ఓటర్ల తుది జాబితా గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన కేసులపై వాదనలను సుప్రీంకోర్టు ఆలకించింది. తెలంగాణలో ఓటర్ల జాబితా అంశంపై సుప్రీంకోర్టులో పిటిషనర్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితా షెడ్యూల్ కుదించారని, తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని కోర్టుకు నివేదించారు.
ఓటర్ల జాబితాలో 68 లక్షల ఓటర్ల విషయంలో అవకతవకలు జరిగాయని, 30 లక్షల బోగస్ ఓట్లున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి 18 లక్షల ఓట్లను తొలగించారని సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళ్లారు. కటాఫ్ తేదీని ఈ ఏడాది జనవరి 1గా నిర్ణయించడం వల్ల 20 లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారని, 2000 సంవత్సరంలో పుట్టిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2024 వరకూ వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.ఇదే అంశంపై హైకోర్టులో పలు కేసులు పెండింగ్ లో ఉన్నందున అన్ని కేసులను హైకోర్టు పరిశీలిస్తుందని తెలిపారు.