టీడీపీ సెల్ఫ్ గోల్... రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు చంద్రబాబు ఆమోదం ఉందా?.
విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు అధికార టీడీపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. అసలు ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే కనీసం ఆ సంఘటనను ఖండించని చంద్రబాబు, డీజీపీలు ఈ సంఘటనను ఎవరిపైకి నెట్టేయాలనే అంశంపైనే ఫోకస్ పెట్టేశారు. అందులో భాగంగానే చంద్రబాబుతో పాటు డీజీపీ కూడా జగన్ పై దాడి చేసింది ఆ పార్టీ అభిమానే అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. నిజంగా జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఎవరైనా ప్రభుత్వం విచారణ జరిపించి ఆధారాలతో బహిర్గతం చేస్తే ఎవరూ ఏమీ మాట్లాడటానికి ఉండదు. కానీ సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఏకంగా సీఎం, డీజీపీలు ఇలా ప్రకటనలు చేయటం ఏమిటి అంటూ అధికార వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేశాయి. వైసీపీ కూడా అదే స్థాయిలో ఈ దాడి వెనక సీఎం చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చేలా చేశాయి. జగన్ చనిపోతే పార్టీ బాధ్యతలు తమ
చేతికి వస్తాయనే ఉద్దేశంతోనే వైసీపీ కార్యకర్తతో వాళ్లిద్దరే జగన్ హత్యకు ప్లాన్ చేయించారని రాజేంద్రప్రసాద్ పార్టీ వేదికపై నుంచి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నిత్యం జగన్ ను, వైసీపీని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే వారు సైతం తప్పుపడుతూ మాట్లాడారంటే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ఎంత డ్యామేజ్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. బాబూ రాజేంద్రప్రసాద్ మీడియా సమావేశంలో అంత సంచలన వ్యాఖ్యలు చేస్తే అవి టీడీపీకి, చంద్రబాబు కు ఎక్కడ నష్టం చేకూరుస్తాయనే భయంతో అస్మదీయ పత్రికలు ఆ వార్తను పూర్తిగా విస్మరించాయి. ఈ మేరకు చంద్రబాబును రక్షణకు పూనుకున్నాయి కొన్ని మీడియా సంస్థలు. అయితే ఇంత పెద్ద ఆరోపణలను ఎమ్మెల్సీ బాబూరాజేందప్రసాద్ చంద్రబాబు ఆమోదం లేకుండా చేయగలుగుతారా?. పార్టీలో ఎవరు ఏమి మాట్లాడాలన్నా చంద్రబాబు డైరక్షన్ ఉండాల్సిందే. నిజంగా చంద్రబాబు అనుమతి లేకుండా మాట్లాడి ఉంటే కనీసం వాటిని పార్టీ తరపున ఖండించి ఉండాలి కదా?. కానీ ఇప్పటివరకూ ఆ పని చేయలేదు. అయితే టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు మీడియా ముందుకు వచ్చి వాటిని చాలా తేలికే చేసే పని చేశారు. అంతే తప్ప...అధికారికంగా ఖండన మాత్రం ఇవ్వలేదు. వైసీపీ నేతలు కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి నారా భువనేశ్వరి, నారా లోకేష్ చేయించారని అంటామా? అని ప్రశ్నించారు. మొత్తానికి అసలే చిక్కుల్లో ఉన్న టీడీపీని రాజేంద్రప్రసాద్ మరింత చిక్కుల్లోకి నెట్టారు. ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో టీడీపీ
దారుణమైన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్లు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.