Telugu Gateway
Andhra Pradesh

నవయుగా..పన్ను కట్టని లావాదేవీలు వెయ్యి కోట్లపైనే?!

నవయుగా..పన్ను కట్టని లావాదేవీలు వెయ్యి కోట్లపైనే?!
X

నవయుగా గ్రూప్ నకు చెందిన కంపెనీల్లో భారీ ఎత్తున పన్ను ఎగవేత జరిగిందా?. అంటే అవుననే చెబుతున్నాయి ఐటి శాఖ వర్గాలు. గత నాలుగు సంవత్సరాలుగా నవయుగా గ్రూప్ కంపెనీల్లో సుమారు పన్ను కట్టని లావాదేవీల మొత్తం 1500 కోట్ల రూపాయల వరకూ ఉన్నట్లు ఐటి శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి..పన్నుతో పాటు కంపెనీ నుంచి జరిమానా వసూలు చేసే అవకాశం ఉంది. తాజాగా నవయుగా గ్రూప్ నకు చెందిన కంపెనీలపై భారీ ఎత్తున ఐటి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రిజిస్టార్ ఆఫ్ కంపెనీ (ఆర్ వోసీ) అధికారులు కూడా తనిఖీలు చేసి..ఒకే అడ్రస్ లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా జరిగిన ఐటి దాడుల్లో ముఖ్యంగా నవయుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు జరిపిన స్టీల్ లావాదేవీల్లో భారీ ఎత్తున తేడాలు ఉన్నట్లు గుర్తించారు. కొనుగోలు చేసిన మొత్తం కంటే ఎక్కువ మొత్తానికి బిల్లులు తీసుకున్నారని ఐటి శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఆ మేరకు నిధులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి అన్నది తేలాల్సి ఉంది.

నవయుగా ఇన్ ఫ్రా పెద్దలు వైఎస్ హయాంలో ఆ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరించారు. ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లకు అత్యంత సన్నిహిత కంపెనీగా నవయుగా మారింది. కేవలం భారీ ఎత్తున పన్ను ఎగవేతలే సాగాయా? లేక డమ్మీ కంపెనీల పేరుతో ఎవరెవరి ఖాతాలకు నిధులు తరలి వెళ్ళాయనే అంశంపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కారణంగానే చంద్రబాబునాయుడు నవయుగాపై ఐటి దాడులు అనగానే టెన్షన్ గురవటంతో పాటు....సేవా భావంతో పనిచేసే కంపెనీపై ఐటి దాడులా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఇదే నవయుగా కంపెనీ తెలంగాణలో కూడా వేలాది కోట్ల రూపాయల పనులు చేస్తోంది. కానీ సీఎం కెసీఆర్ ఈ ఐటి దాడులపై నోరెత్తి మాట్లాడలేదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కరే ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారు?. ఆ సంస్థ, ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలు ఏంటి?. అన్నది విచారణలో తేలాల్సి ఉంది..

Next Story
Share it