కేంద్రానికి రాఫెల్ డీల్ పై సుప్రీం ఝలక్

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇఛ్చింది. ఈ మధ్య కాలంలో అత్యంత సంచలనంగా మారిన రాఫెల్ డీల్ వ్యవహారంపై సీల్డ్ కవర్ లో నివేదిక అందివ్వాలని ఆదేశించింది.అయితే ధర...సాంకేతిక వివరాలను తాము అడగటం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒప్పందం ఖరారుకు సంబంధించిన వివరాలను కోర్టు కోరింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈనెల 29లోగా ఒప్పంద వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాఫెల్ డీల్‌పై తాము కేంద్రానికి ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని, పిటిషనర్ చేసిన ఆరోపణలు సరైనవికానందున కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోబోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది.
ఈ ఒప్పందంపై పిటిషన్లు దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులు రాఫెల్ డీల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఒప్పందంలోని వివరాలను కేంద్రం వెల్లడించాలని లేదా ఒప్పందాన్ని రద్దు చేయాలని పిటిషనర్లు తమ పిటిషన్‌లో కోరారు. కాగా పిటిషనర్లు రాజకీయ ప్రయోజనాలను ఆశించి కేసు వేశారని కేంద్రం తరపు న్యాయవాది అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు నివేదించారు. రాఫెల్ యుద్ధవిమానాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు.