108 వాహనాలకు రిపేర్లా...సింగపూర్ కు విమానాలు ముఖ్యమా?
పద్దెనిమిది కోట్లు ఎదురిచ్చి సింగపూర్ విమానాలు నడపాలా బాబూ!
ఓ వైపు ఏపీలో పలు గ్రామాలకు సరైన రోడ్లు లేవు. కొన్ని గ్రామాల్లో సరైన మంచి నీటి సౌకర్యమే లేదు. ఆస్పత్రుల్లోనూ అరకొర సౌకర్యాలే. అత్యవసర సమయాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించే 108 వాహనాలకు పట్టించుకునే దిక్కే లేదు. పాఠశాలల్లో సరైన టాయిలెట్లు కూడా లేవు. ఇవా ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు. లేక ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ కు 18 కోట్ల రూపాయలు ఎదురు ఇచ్చి ‘సింగపూర్’కు విమానాలు నడపటం అత్యవసరమా?. అసలు ఏపీలో ఏమీ సమస్యలు లేవు... ఫ్రాబ్లమ్ ఫ్రీ ఏపీ అయితే..ప్రభుత్వం ఒక్క సింగపూర్ కు ఏంటి..దుబాయ్, బ్యాంకాగ్, శ్రీలంకకు సర్వీసులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఏపీలో ఎన్నో సమస్యలను అట్టేపెట్టుకుని..ఓ వైపు రాష్ట్రం ఆర్థిక సమస్యలతో అల్లాడుతుందని చెబుతూ సింగపూర్ కు విమానాలు నడిపేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు అంత ఆరాటపడుతున్నారు?. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ విమానయాన కనెక్టివిటి లేదు.
ఉన్నా అరకొర సర్వీసులే. ఏపీ నుంచి అమెరికాతోపాటు..సింగపూర్, దుబాయ్, శ్రీలంక కు వెళ్ళే ప్రయాణికుల సంఖ్య కూడా బాగానే ఉంటుంది. ఈ మధ్యే విశాఖపట్నం నుంచి శ్రీలంకకు విమాన సర్వీసులు నడుపుతున్న శ్రీలంక ఎయిర్ లైన్స్ ట్రాఫిక్ లేని కారణంగా తన సర్వీసులను రద్దు చేసుకుంటానని ప్రకటించింది. విదేశీ పర్యటనలకు బయులుదేరే వారంటే కాస్తో కూస్తో ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారే ఉంటారు. సింగపూర్, దుబాయ్, అమెరికా, శ్రీలంక వంటి పర్యటనలకు వెళ్లాలంటే ఇప్పుడు హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల వారికి చెన్నయ్ విమానాశ్రయం దగ్గర. అదే అనంతపురం వాళ్ళకు అయితే బెంగుళూరు విమానాశ్రయం చేరువగా ఉంటుంది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్నామంటూ ఏపీ ప్రభుత్వం ఇండిగో సంస్థకు వయబులిటీ గ్యాఫ్ ఫండింగ్ కింద 18 కోట్ల రూపాయలు చెల్లించటానికి రెడీ అవటంపై అధికార వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.